ఇంగ్లండ్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను ఆతిథ్య ఇంగ్లాండ్ విజయం సాధించింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ తొలి టెస్టులో శ్రీలంకపై ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (62 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. యువకెరటం వికెట్ కీపర్ జేమీ స్మిత్ (39), ఓపెర్ డానియల్ లారెన్స్ (34) రాణించారు.
కాగా, తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 236 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వా (74), మిలన్ రత్నాయకె (72) సత్తాచాటారు. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగుల భారీ స్కోరు చేసింది. జేమీ స్మిత్ (111)శతకం సాధించాడు. లంక బౌలర్లలో అషిత ఫెర్నాండో నాలుగు, ప్రభత్ మూడు వికెట్లు పడగొట్టారు.
రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక జట్టు 326 పరుగులు చేసింది. కామిందు మెండిస్ (113) సెంచరీ బాదాడు. క్రిస్ వెక్స్, మాథ్యూ పాట్స్ చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 57.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఇక లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ నెల 29న ఇంగ్లండ్-శ్రీలంక మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది.
చరిత్ర సృష్టించిన జో రూట్..
శ్రీలంకతో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే, ఇంగ్లండ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జో రూట్… అరుదైన రికార్డులు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా జో రూట్ చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (68) అగ్రస్థానంలో ఉన్నాడు. చంద్రపాల్ (66), రూట్ (64*) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక అలెన్ బోర్డర్ (63), రాహుల్ ద్రవిడ్ (63), రికీ పాంటింగ్ (62) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
మాంచెస్టర్ వేదికగా ఈ ఫార్మాట్‌లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన ప్లేయర్‌గా రూట్ రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో రూట్ (8), ఇయాన్ బెల్ (7), డెనిస్ కాంప్టన్ (7) టాప్-3లో ఉన్నారు. ఇక నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 50+ స్కోరు సాధించిన ఇంగ్లండ్ ఆటగాళ్ల జాబితాలో.. జో రూట్ (10) నాలుగో స్థానంలో నిలిచాడు. మైక్ అథర్టన్ (11), కుక్ (11), బాయ్‌కాట్ (10) రూట్ కంటే ముందు ఉన్నారు.