Saturday, November 23, 2024

పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒకే వేదికపైకి.. 23న విశాఖలో ఇంధన సామర్థ్య పెట్టుబడుల సదస్సు

అమరావతి, ఆంధ్రప్రభ: దేశంలో ఇంధనం పొదుపు, ఇంధన సామర్ధ్య పెంపుదలకు ఆర్థికపరంగా, పర్యావరణ పరంగా ప్రయోజనాలు రావటానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ సమాయత్తమవుతోంది. ఇందుకు సంబంధించి విశాఖపట్నం వేదికగా ఇంధన సామర్ధ్య పెట్టుబడుల సదస్సును రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌ సహకారంతో మరో సారి నిర్వహించేందుకు ముందుకొచ్చింది. ఈ సందర్భంగా దేశంలో ఇంధన సామర్ధ్య రంగంలో 2031 నాటికీ రూ.13.20 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు అవకాశముందని, దీనిలో రూ.10.72 లక్షల కోట్ల పెట్టుబడులు పరిశ్రమలు, వాణిజ్య, రవాణా రంగాల్లోనే వచ్చేందుకు ఆస్కారం ఉంటుంందని బీఈఈ వెల్లడించింది.

రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్ధ్య సాంకేతికతను అందుబాటులోకి తేవటం, సదరు సాంకేతికతను ఉపయోగించుకునేందుకు పరిశ్రమలకు ఆర్థిక సహకారం అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఈఈతో కలిసి రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం) ఈనెల 23న విశాఖపట్నంలో ఇంధన సామర్ధ్య పెట్టుబడుల సదస్సు (ఇన్వెస్ట్మెంట్‌ బజార్‌) ను నిర్వహించనుంది. ఇంధన సామర్ధ్య సాంకేతికతపై ఆసక్తి గల పరిశ్రమలను అందుకు అవసరమైన సహకారం అందించే బ్యాంకులు, ఆర్థిక సంస్థలను ఒకే వేదిక పైకి తేవడమే లక్ష్యంగా ఈకార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గత ఏడాది మార్చిలో విశాఖపట్నంలో నిర్వహించిన ఇంధన సామర్ధ్య పెట్టుబడుల సదస్సుకు మంచి స్పందన రావడంతో బీఈఈ మరలాఇన్వెస్ట్మెంట్‌ బజార్‌ నిర్వహణ కోసం విశాఖపట్నంను ఎంపిక చేసుకుంది.

- Advertisement -

తొలి దశలో ఆరు రాష్ట్రాల్లో..

తొలి దశలో ఆరు రాష్ట్రాల్లో ఇన్వెస్టుమెంట్‌ బజార్లను ఏర్పాటు చేస్తున్నట్లు బీఈఈ డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ భాక్రే తెలిపారు. ఈమేరకు ఆయన రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే విజయానంద్‌, ఏపీఎస్‌ఈసీఎం అధికారులతో ఆదివారం వెబినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇంధన సామర్ధ్య రంగంలో దేశంలో 2031 నాటికీ రూ 13.20 లక్షల కోట్ల భారీ పెట్టుబడులకు అవకాశముందని తెలిపారు. దీనిలో రూ.10.72 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రత్యేకించి పరిశ్రమలు, వాణిజ్య, రవాణా రంగాల్లోనే వచ్చేందుకు అవకాశముందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంధన సామర్ధ్య పెట్టుబడుల సదస్సు నిర్వహణకు తొలిదశలో ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్‌, రాష్ట్రాలను ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు.

ఈ ఇన్వెస్ట్మెంట్‌ బజార్‌ వేదికపై పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కలిసి ఇంధన సామర్ధ్య పెట్టుబడులకు అవకాశమున్న ప్రాజెక్టులను గుర్తించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో ఇంధన సామర్ధ్య ప్రాజెక్టులను పరిశీలించేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో కలిసి ఒక ప్రత్యేక కమిటీని ఏపీఎస్‌ఈసీఎం ఏర్పాటు చేసిందన్నారు. ఇన్వెస్ట్మెంట్‌ బజార్‌లో ఎంపికైన పరిశ్రమలకు ఇంధన సామర్ధ్య ప్రాజెక్టులు అమలు చేసేందుకు ఆర్థిక సహకారం అందించడం జరుగుతుందని తెలిపారు. పరిశ్రమల్లో ఇంధన సామర్ధ్య సాంకేతికతను అమలు చేయడంవల్ల తక్కువ మొత్తంలో విద్యుత్‌, ఇంధన వనరులను ఉపయోగించుకుని నాణ్యమైన, ఎక్కువ ఉత్పాదకతను సాదించేందుకు దోహదపడుతుందన్నారు. దీనివల్ల విద్యుత్‌పై పరిశ్రమలు చేసే వ్యయం తగ్గటమేగాక పర్యావరణ పరిరక్షణకు దోహదకారి అవుతుందని పేర్కొన్నారు.

కాలంచెల్లిన సాంకేతికతకు చెల్లు చీటి

చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో కాలం చెల్లిన సాంకేతికత స్థానాల్లో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు కూడా ఇది దోహదపడుతుందని వెల్లడించారు. అలాగే పెద్ద పరిశ్రమల్లో సాంకేతిక మెరుగుదలకు ఉపయోగపడుతుందన్నారు. పరిశ్రమల నిర్వహణ వ్యయం కొంత మేర తగ్గేందుకు సహాయపడుతుందన్నారు. దేశంలో తొలిసారిగా ఇంధన సామర్ధ్య పెట్టుబడుల సదస్సును నిర్వహించిన ఘనత ఆంధ్రప్రదేశ్‌కే దక్కుతుందని బీఈఈ డైరెక్టర్‌ జనరల్‌ ప్రశంసించారు. గత ఏడాది విశాఖపట్నంలో నిర్వహించిన సదస్సుకు పరిశ్రములు, ఆర్థిక సంస్థల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావటం హర్షణీయమన్నారు.

ఈ ఏడాది కూడా పెట్టుబడుల సదస్సు విజయవంతం అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. విద్యుత్‌ రంగంలో ప్రత్యేకించి ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ చేస్తున్న అత్యుతమ పనితీరును గుర్తించి మరోసారి విశాఖపట్నంలోని పెట్టుబడుల సదస్సు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ఇంధన సామర్ధ్య పెట్టుబడుల సదస్సులో రూ.300 కోట్ల విలువైన ప్రాజెక్టులను గుర్తించినట్లు తెలిపారు.

ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది

రాష్ట్రంలో ఇంధన సామర్ధ్య ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇంధన శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీకే విజయానంద్‌ చెప్పారు. పరిశ్రమల నుంచి ఏపీఎస్‌ఈసీఎంకు ప్రతిపాదనలువస్తే వాటికి అవసరమైన సాంకేతిక ప్రక్రియ నిర్వహించి, ఆర్థిక సంస్థలకు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యూనియన్‌ బ్యాంకు, ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఎస్‌ బ్యాంకు, ఐఓబీ, బ్యాంకు అఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంకు అఫ్‌ ఇండియా తదితర బ్యాంకులతో ఇప్పటికే ఫైనాన్సియల్‌ కమిటిను ఏపీఎస్‌ఈసీఎం ఏర్పాటు చేసిందన్నారు. ఇంధన సామర్ధ్య రంగానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌హన్‌ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

ఇంధన భద్రతను పెంపొందించడంలో, 24/7 విద్యుత్‌ అందుబాటు- ధరల్లో వినియోగదారులకు అందించడానికి, ఇంధన సామర్థ్యం కొంత మేర దోహదం చేస్తుందన్నారు. పెట్టు-బడుల సదస్సుకు విశాఖపట్నంను ఎంపిక చేసుకున్నందుకు ఆయన బీఈఈకు కృతఙ్ఞతలు తెలిపారు. పరిశ్రమలల్లో ఇంధన సామర్ధ్యాన్ని ప్రోత్సహించేందుకు పరిశ్రమల శాఖ అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ఇంధన సామర్ధ్య పెట్టు-బడుల సదస్సు విజయవంతం అవటానికి తగిన చర్యలు, ఏర్పాట్లు చేయాలనీ ఎస్‌ఈసీఎం అధికారులను ఆయన ఆదేశించారు. వివిధ పరిశ్రమలుకు, బ్యాంకులకు ఇప్పటికే ఆహ్వానం పంపినట్లు ఏపీఎస్‌ఈసీఎం అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement