విశాఖ దేవాదాయ శాఖలో విభేదాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన కింద పనిచేసే ఓ అసిస్టెంట్ కమిషనర్ తన ముఖంపై ఇసుక తీసుకుని చల్లడం స్థానికంగా సంచలనంగా మారింది. విశాఖ జిల్లా దేవాదాయ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన తన కింది సిబ్బంది వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన అనేక పర్యాయాలు వారిని హెచ్చరించారు. ఆయన చేతిలో మందలింపులకు గురైన వారిలో అసిస్టెంట్ కమిషనర్ శాంతి కూడా ఉన్నారు. శాంతిని తన ఛాంబర్‌కు పిలిపించిన ఆయన మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో సహనం కోల్పోయిన శాంతి, తాను తీసుకువచ్చిన ఇసుకను కోపంతో ఆయనపై చల్లారు.
ఈ ఘటనపై డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ దేవాదాయశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో, అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించగా.. అసిస్టెంట్ కమిషనర్ శాంతి వివరణ ఇచ్చారు. డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని, అతడి తీరు దారుణంగా ఉందని ఆరోపించారు. వ్యక్తిగత కక్షలను మనసులో ఉంచుకుని వేధించాడని, మానసిక వేదన భరించలేకే అతడిపై ఇసుక చల్లాల్సి వచ్చిందని తెలిపారు. అతడిపై ఇప్పటికే కమిషనర్ కు ఫిర్యాదు చేశానని, విచారణకు పిలిస్తే రాకుండా తన న్యాయవాదితో వస్తానని తప్పించుకున్నాడని ఆరోపించారు. అతడి తప్పు లేకపోతే కమిషనర్ పిలిచినప్పుడు విచారణకు ఎందుకు రాలేదని శాంతి ప్రశ్నించారు.
ఈ వార్త కూడా చదవండి: ప్రశాంత్ కిషోర్ రాజీనామా