Thursday, September 19, 2024

అంతులేని దుబారా.. పెరుగుతున్న ఖర్చులపై ప్రభుత్వం ఆరా..

అమరావతి, ఆంధ్రప్రభ: ప్రభుత్వ శాఖల్లో పెరుగుతున్న దుబారాపై ఆర్థికశాఖ అసహనం వ్యక్తం చేస్తోంది.. ఖర్చుల నియంత్రణకు కసరత్తు జరుపుతోంది.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న పరిస్థితుల్లో కొందరు హెచ్‌ఓడీల కార్యాలయాల నుంచి వచ్చే బిల్లులు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి.. పలువురు ఐఏఎస్‌ అధికారులకు సచివాలయంలో చాంబర్లు ఉన్నప్పటికీ గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లిలో ప్రత్యేక క్యాంప్‌ కార్యాలయాలకు లక్షలాది రూపాయల అద్దె చెల్లించాల్సి వస్తోందని చెప్తున్నారు.. హెచ్‌ఓడీలకు హెచ్‌ఆర్‌ఏ మాటెలా ఉన్న ఇళ్లలో ఇంటీరియర్‌ డెకరేషన్ల పేరిట అద్దెకు లీజుకు తీసుకున్న భవనాల్లోనే లక్షలాది రూపాయల మేర ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.. ఓ వైపు సచివాలయంలో అరకొర వసతులతోనే సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు కార్యదర్శులు తమ చాంబర్లలో కాలక్షేపం చేస్తుంటే మరోవైపు అనవసరమైన ఖర్చులు పెరగటాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.. కోవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది. రాష్ట్రవిభజన నాటి నుంచి హైదరాబాద్‌ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు ప్రభుత్వం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలోని రెయిన్‌ ట్రీ పార్కుతో పాటు విజయవాడ,తాడేపల్లి పట్టణాల్లో అపార్టుమెంట్లకు ఇప్పటికీ భారీగా అద్దెలు చెల్లిస్తోంది..

ఏటా కోట్ల రూపాయలు హెచ్‌ఓడీల కార్యాలయాలు, ఇళ్ల అద్దెలకే సరిపోతోందని చెప్తున్నారు.. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కొన్ని ప్రభుత్వ శాఖలు వసూళ్లలో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేకపోవటంతో పాటు అదనపు ఖర్చులను ఎలా భరిస్తామని ఆర్థికశాఖ పెదవి విరుస్తున్నట్లు తెలిసింది. ఆదాయం వచ్చే శాఖల్లో ఎక్సైజ్‌, కొద్దో గొప్పో స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, జీఎస్‌టీ విభాగాలే ముందున్నాయి.. భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఎక్సైజ్‌ శాఖ కార్యాలయాలు.. ఆ శాఖ ఉన్నతాధికారులు ఖర్చుల నియంత్రణ పాటిస్తుంటే పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పురపాలకశాఖ, వైద్యారోగ్యం, విద్యుత్‌, వ్యవసాయ మార్కెటింగ్‌, పౌరసరఫరాలు, పరిశ్రమలశాఖల్లో పరిమితికి మించి ఖర్చు చేస్తున్నట్లు ఆ శాఖ నుంచి వచ్చే బిల్లులను పరిశీలిస్తే తేలుతుందని చెప్తున్నారు. విభజన అనంతరం గుంటూరు, విజయవాడ, ఇబ్రహీంపట్నం, తాడేపల్లి, మంగళగిరి పట్టణాల్లో వివిధ హెచ్‌ఓడీల కార్యాలయాలు ఏర్పాటయ్యాయి.

రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటయి జిల్లాకేంద్రంంలో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్లకు అనువైన భవనాలు దొరక్క అన్వేషణ జరుపుతుంటే ఉన్న కార్యాలయాల్లో హంగులకు కొందరు హెచ్‌ఓడీలు ప్రాధాన్యత, ప్రతిష్టకు పోవటాన్ని ఆర్థికశాఖ తప్పుపడుతోంది. హెచ్‌ఓడీలు, ఐఏఎస్‌ల నివాసాలకు నెలకు రూ. 40 వేల నుంచి లక్ష రూపాయల వరకు వెచ్చించి ప్రభుత్వం లీజుకు ఒప్పందం కుదుర్చుకుంటోంది.. ఇది చాలక ఇంటీరియర్‌ డెకరేషన్‌కు లక్షలాది రూపాయలు వెచ్చించటం వల్ల అదనపు భారం పడుతోంది.. ఆదాయంలో లక్ష్యాలను అధిగమించకుండా అనవసరపు దుబారా ద్వారా ఖజానాపై భారం పడుతోందని చెప్తున్నారు. ప్రభుత్వం నియమిస్తున్న సలహాదార్లు, కులాల వారీగా బీసీ కార్పొరేషన్ల కార్యాలయాలే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు.. కనీసం ప్రభుత్వపరంగా నామినేట్‌ అయిన వారికి వాహన సదుపాయాలు కూడ లేక అవస్తలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో బ్యూరోక్రాట్ల ఇళ్లు, కార్యాలయాలకు రెట్టింపు ఖర్చు చేయటం తగదని ఆర్థికశాఖ వారిస్తున్నట్లు తెలిసింది. ఉన్నతాధికారులకు సొంత వాహనాలు ఉన్నా అధికారిక కార్యక్రమాలు, శాఖాపరమైన అవసరాల నిమిత్తం ప్రభుత్వం కోట్లాది రూపాయలు వాహనాలకు అద్దె చెల్లిస్తోంది.. ఈ వాహనాలకు టోల్‌గేట్‌ మినహాయింపు కూడా ఇవ్వడంతో వచ్చే ఆదాయానికి గండిపడుతోందని ఓ ఉన్నతాధికారి వివరించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో కొనుగోలు చేసే సామాగ్రిలో నాణ్యతా ప్రమాణాలు లోపించి తరచు మరమ్మతులు చేయించాల్సి వస్తోందని.. దీనిపై పర్యవేక్షణ కొరవడిందని చెప్తున్నారు. ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుంటే కొందరు విభాగాధిపతులు ఇష్టారాజ్యంగా రూ. 10 లక్షల కు మించకుండా పనులను వర్గీకరించి రివర్స్‌ టెండరింగ్‌ నుంచి తప్పించి మరీ అయిన వారికి కాంట్రాక్టు అప్పగించి కమిషన్లు పొందుతున్నట్లు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో మొత్తంగా ఖర్చుల నియంత్రణపై దృష్టి సారించింది. ప్రభుత్వ విభాగాల్లో కన్సల్టెంట్ల వ్యవస్థను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రకటించారు. ప్రభుత్వ విభాగాలన్నీ ఐటీ శాఖ అజమాయిషీలో లావాదేవీలు నిర్వహించాలని కూడా ఆదేశించారు. అయితే ఇప్పటికీ వివిధ ప్రభుత్వ శాఖల్లో కన్సల్టెంట్లకు భారీగా చెల్లింపులు జరుపుతున్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులు సైతం కన్సల్టెంట్లు శాసిస్తున్నారంటే పరిస్థితి ఏ రకంగా ఉందనేది ఊహించవచ్చు. దుబారాను కట్టడి చేయటం ద్వారా ప్రభుత్వంపై భారం తగ్గించుకునేందుకు కసరత్తు ప్రారం భించనున్నట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement