Tuesday, November 26, 2024

ముగిసిన ముహూర్తాలు.. మూడు ముళ్ల బంధానికి 3 నెలల బ్రేక్‌

పీపీప్పీ.. డుండుం అంటూ సందడి చేసే డోలు, సన్నాయిలు. చప్పుడు చేయకుండా మూడు నెలల పాటు మూగబోయే సమయం ముగియనుంది. ఇక మూడు నెలల వరకు పెళ్లి మంత్రాలు చదివే పురోహితులు మౌన వ్రతం చేపట్టాల్సిందే.. వంట మేస్త్రీ, పూల అలంకరణ చేసేవాళ్లు, క్యాటరింగ్‌ సిబ్బంది, లైటింగ్‌ డెకరేషన్‌ వారు, పెళ్లిముంతలు చేసే స్కిల్‌ వర్కర్లు, ప్రైవేటు కల్యాణ మండపాల యజమానులు విశ్రాంతి తీసుకోవాల్సిందే. అదే విధంగా ఇప్పటివరకు కొనుగోలు దారులతో కళ కళ లాడిన బంగారం, వస్త్రదుకాణాలు వెలవెల బోయే పరిస్థితులు రానున్నాయి. ఈ నెల 28 నుంచి భాద్రపద మాసం శూన్యమాసం కావడంతో పాటు సెప్టెంబరు 18 నుంచి శుక్ర మౌఢ్యమి ప్రారంభం కానుంది. ఆశ్వీయుజ, కార్తీక మాసాలు మంచివైనా మౌడ్యమి నవంబరు 27 వరకు ఉండడంతో మూడు ముళ్ల బంధానికి మూడునెలల పాటు బ్రేక్‌ పడింది.

ఆ తరువాత డిసెంబరులో 26 వరకు పెళ్లిళ్లకు ముహూర్తాలు ఉన్నాయి. మూఢం వస్తుండడంతో వివాహాది శుభకార్యాలకు సోమవారం ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. పెళ్లి బృందాలు ఇప్పటికే తొందరపడుతున్నాయి. ఈనెల 20,21 వరుసగా పెద్ద ఎత్తున వివాహాలు జరుగగా చివరి రోజు సోమవారం వివాహాలు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. వరుసగా వున్న ఈ మూడు రోజుల్లోనే వేలాది జంటలు ఒక్కటయ్యాయి.

వివాహాల కారణంగా పుణ్య క్షేత్రాలు పెళ్లి సందడిలో కళకళలాడాయి. దీంతో భక్తుల తాకిడి కూడా పెరిగింది. తద్వారా దేవాలయాల ఆదాయం కూడా భారీగా పెరిగింది.. అదే విధంగా ఏపీ, తెలంగాణ‌ రాష్ట్ర వ్యాప్తంగా వున్న దేవాలయాల్లో కూడా భారీ ఎత్తున వివాహాలు జరిగాయి. అయితే సోమవారం తరువాత దాదాపు మూడు నెలల పాటు వివాహాధి, శుభకార్యాలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడనుంది. ఇదిలా వుండగా శ్రావణ మాసంలో వివాహాలతో పాటు వరలక్ష్మీ వ్రతాలు, శ్రావణ పూర్ణిమ, శుక్రవారాలు, గోకులాష్టమి తదితర పండు గలు రావడంతో పూలు, పండ్లకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. కిలో మల్లె పూలు రికార్డు స్థాయిలో వెయ్యి రూపాయలు పలుకగా, జాజులు కిలో రూ. 800 వందలకు చేరింది. మిగిలిన అన్ని రకాల పూల ధరలు అమాంతం పెరిగాయి. అలాగే అన్ని రకాల పండ్ల ధరలు పెంచేశారు. కాగా సోమ వారంతో సుముహూర్తాలు ముగియనుండంతో పూలు, పండ్ల ధరలు పడిపోయే అవకాశం ఉంది. అలాగే బంగారం, వెండి ధరలు కూడా క్షీణించే అవకాశం వున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement