Tuesday, November 26, 2024

The End – సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమాప్తం…బెంగాల్ మినహా అంతటా ప్ర‌శాతం

ఏండల‌తో పోలింగ్ కేంద్రాల‌కు ఓట‌ర్లు దూరం
వ‌డ గాల్పుల‌కు 19 మంది ఎన్నిక‌ల సిబ్బంది మృతి
మొత్తం 57 లోక్ స‌భ స్థానాల‌కు పోలింగ్
నేటితో ఏడు ద‌శ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు తెర
ప‌శ్చిమ బెంగాల్‌లో బాంబుల మోత‌
నీటి కుంట‌లో ప‌డేసిన ఈవీఎంలు
ఈ ద‌శ ఎన్నిక‌ల బ‌రిలో మోదీ, కంగ‌నా
ఓటు హ‌క్కు వినియోగించుకున్న పంజాబ్, యూపీ ముఖ్య‌మంత్రులు

లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ శ‌నివారంతో ముగిసింది. ప‌శ్చిమ బెంగాల్లో మిన‌హా మిగిలిన అన్ని ప్రాంతాల్లో పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. సుదీర్ఘంగా సాగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో దశలో కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌తో పాటు బీహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జ‌రిగింది. యూపీలో13, బీహార్‌లోని 8, పశ్చిమ బెంగాల్‌లో 9, జార్ఖండ్‌ 3, పంజాబ్ 13, హిమాచల్ ప్రదేశ్ 4, ఒడిశా 6 లోక్ సభ స్థానాలే, 42 అసెంబ్లీ సీట్లతో పాటు అటు కేంద్ర పాలిత ప్రాంతం చండీగ‌ఢ్‌కు ఈ విడతతోనే ఎన్నికల ప్రక్రియ పూర్త‌య్యింది.

904 మంది అభ్య‌ర్థులు..

- Advertisement -

ఈ ద‌శ‌లో 904 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా.. మొత్తం 10.06 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 5.24 కోట్ల మంది పురుషులు, 4.82 కోట్ల మంది మహిళలు, 3,574 మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లున్నారు. మొత్తం 1.09 లక్షల పోలింగ్ కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. పంజాబ్ నుంచి అత్యధికంగా 328 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా..ఆ తర్వాత యూపీలో 144 మంది , బిహార్‌లో 134 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

ఎన్నిక‌ల బ‌రిలో ప్ర‌ధాని మోదీ..

చివరి విడత ఎన్నికల బరిలో వారణాసిలో ప్రధాని మోదీపై.. కాంగ్రెస్ కీలక నేత అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. దీంతో కాశీలో పోలింగ్ పై ఆసక్తి నెలకొంది. బీజేపీకి చెందిన సినీ నటి కంగనా రనౌత్, కాంగ్రెస్ నుండి విక్రమాదిత్య సింగ్ మండి నుండి బరిలో ఉన్నారు. గోరఖ్‌పూర్‌ నుంచి బీజేపీ అభ్యర్థి రవికిషన్‌, సమాజ్‌వాదీ అభ్యర్థి కాజల్‌ నిషాద్‌ మధ్య పోటీ నెలకొంది. హమీర్‌పూర్‌ నుంచి బీజేపీ తరఫున అనురాగ్‌ ఠాకూర్‌, కాంగ్రెస్‌ తరఫున సత్యపాల్‌ సింగ్‌ బరిలో ఉన్నారు. బెంగాల్‌లోని డైమండ్ హార్బర్‌లో టీఎంసీ అభ్యర్థి అభిషేక్ బెనర్జీ, బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ మధ్య పోటీ నెలకొంది. బీహార్‌లోని పాటలీపుత్ర స్థానం నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఓటేసిన యోగి, కంగ‌నా

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓల్డ్ గోరఖ్‌పూర్ లోని గోరఖ్‌నాథ్ (బాలికలు) బూత్ నంబర్ 223లో ఓటు వేశారు. ఆర్జేడీ నేత, బీహార్‌ మాజీ సీఎం తేజస్వీ యాదవ్ పాట్నాలోని వెటర్నరీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌కి వీల్‌ చైర్‌లో వ‌చ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తన భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్‌తో కలిసి ఓటు వేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ నుంచి బీజేపీ అభ్యర్థిగా తొలిసారి ఎన్నికల బరిలో దిగిన బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

19 మంది పోలింగ్ సిబ్బంది మృతి..

ఉత్తరప్రదేశ్‌లో వడదెబ్బకు 19 మంది పోలింగ్‌ సిబ్బంది మృతి చెందారు. శుక్రవారం అత్యధిక ఉష్ణోగ్రతలకు తాళలేక జనం విలవిలలాడిపోయారు. ఈ నేపధ్యంలో ఎన్నికల విధుల్లో నిమగ్నమైన 19మంది పోలింగ్‌ సిబ్బంది కన్నుమూశారు. ఈ వివరాలను ఎన్నికల అధికారులు తెలిపారు.
యూపీలోని మిర్జాపూర్ జిల్లాలో 13 మంది ఎన్నికల సిబ్బంది ఎండి వేడిమి కారణంగా తీవ్ర జ్వరం, అధిక రక్తపోటుకు గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 23 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోన్‌భద్ర జిల్లాలో ఎన్నికల విధుల్లో ఉన్న మరో అరుగురు ఉద్యోగులు మృతి చెందారు. ఓటర్లు ఎండవేడిమికి గురికాకుండా ఉండేందుకు పలు ఏ‍ర్పాట్లు చేశారు. పోలింగ్‌ స్టేషన్ల వద్ద పారామెడికల్‌ సిబ్బందిని, ఆశా వర్కర్లను అందుబాటులో ఉంచారు.

పశ్చిమ బెంగాల్లో ఈవిఎంలు ధ్వంసం..

పోలింగ్ సంద‌ర్భంగా పశ్చిమ బెంగాల్‌లో హింస చెలరేగింది. లోక్‌సభ చివరి దశ ఎన్నికల్లో వివిధ ప్రాంతాల నుండి చెదురుమదురు హింసాత్మక ఘటనలు మళ్లీ వెలువడుతున్నాయి. ఈ క్రమంలో దక్షిణ 24 పరగణాల జిల్లా జయనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని కుల్తాలి ప్రాంతంలోని పోలింగ్ బూత్‌లో ఉదయం ఓటింగ్ ప్రారంభమైన తర్వాత అధికార తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ఉన్న కొందరు వ్యక్తులు.. స్థానిక ప్రజలను ఓటింగ్ చేయకుండా నిలిపివేశారు. దీనికి నిరసనగా ఓటింగ్‌ ప్రారంభమైన 20 నిమిషాల్లోనే స్థానిక ప్రజలు ఈవీఎంలు, వీవీప్యాట్‌ యంత్రాలను చెరువులో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్తులు పోలీసుల వాహనాలపై చెట్లు కొమ్మలు విసిరి నిరసనకు దిగారు. ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సంఘటన కుల్తాలిలోని మేరీగంజ్‌లోని బూత్ నంబర్ 40, 41లో జరిగింది.

తృణమూల్‌కు మద్దతిచ్చిన అక్రమార్కులు తమను ఓటు వేయకుండా అడ్డుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను తృణమూల్ కాంగ్రెస్ తోసిపుచ్చింది. అదే సమయంలో సెక్టార్ ఆఫీసర్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. సంఘటన తర్వాత ప్రత్యామ్నాయ ఈవీఎంలతో బూత్‌లో మళ్లీ ఓటింగ్ నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement