ఖమ్మం, ఆంధ్రప్రభ : మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభమైంది. విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ సెల్‌లో ఐబీఎం ఇండియా వారి సహకారంతో ఈ సెంటర్‌ను ప్రారంభించారు. జ్యూట్, పేపర్ బ్యాగులు, మగ్గం వర్క్స్, పేపర్ ప్లేట్స్, టైరింగ్ ట్రైనింగ్‌తో పాటు మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెట్ లింకేజ్, ఆర్థిక అంశాల నిర్వహణపై అవగాహన కోసం ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించినట్టు మల్లిక మెమోరియల్ ట్రస్ట్ నిర్వాహకులు నవీన్ ప్రతాపనేని చెప్పారు.
మహిళలకు తమ ఉత్పత్తులను ఎలా మార్కెట్ చేసుకోవాలనే విషయాలు కూడా ఈ సెంటర్ ద్వారా తెలుస్తాయని అన్నారు. కాలేజీ పూర్వ విద్యార్థి ప్రత్యూష ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా జ్యూట్ బ్యాగుల తయారీ, మగ్గం వర్క్స్, శారీ రోలింగ్‌తో తొలి అడుగు వేస్తున్నట్టు ఆయన తెలిపారు. తనకు సహాయ సహకారాలు అందిస్తున్న మహిళా కాలేజీ అధ్యాపకులు, ఐబీఎం యాజమాన్యం, మల్లిక మెమోరియల్ ట్రస్ట్, భారతీయ యువ శక్తి సంస్థకు ప్రత్యూష ధన్యవాదాలు తెలిపారు.
ఐబీఎం ఇండియా అందించిన నిధులతో ఇంక్యుబేషన్ సెంటర్‌ను ప్రారంభించినట్టు కళాశాల ప్రిన్సిపల్ జి. పద్మావతి వెల్లడించారు. ఈ కార్యక్రమంలొ పర్చ శ్రీనివాసరావు, తిరుమలాదేవి, మంజుల, కృష్ణకుమారి, పూర్వ విద్యార్థుల సంఘం కోఆర్డినేటర్ పి. కృష్ణవేణి , మహిళా సాధికారత కోఆర్డినేటర్ డా . జి. విద్యా ప్రవీణ, సి.హెచ్. వెంకటేశ్వరరావు, రాకేష్ శ్రీరామ, ప్రవీణ్ కుమార్, హదస్స రాణి, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.