Saturday, November 23, 2024

Delhi | శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలను ప్రోత్సహించండి : ఎంపీ శ్రీకృష్ణ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళల ప్రాతినిథ్యం పెరిగేలా ప్రోత్సాహం అందించాలని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చంద్రయాన్‌ ప్రయోగం విజయవంతమైన సందర్భంగా గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. చంద్రయాన్‌ ప్రయోగంలో భాగమైన మెజారిటీ శాస్త్రవేత్తలు దాదాపు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్‌ కళాశాలల నుంచి వచ్చిన వారే కావడం గొప్ప విషయమన్నారు.

రాష్ట్రాల్లోని యూనివర్శిటీలకు రాష్ట్రీయ ఉచ్చతర్‌ శిక్షా అభియాన్‌ కింద నాలుగైదు సంవత్సరాలుగా ఏటా రూ.8,120 కోట్లు నిధులు కేటాయింపులు జరుగుతున్నా 60 శాతం కూడా వినియోగించట్లేదని శ్రీకృష్ణ చెప్పుకొచ్చారు. ఎందరో శాస్త్రవేత్తలను అందిస్తున్న ఈ యూనివర్శిటీలు నిధులు వాడుకునేలా వెసులుబాటు కల్పించాలని ఆయన కోరారు. అమెరికా, యూకే వంటి అగ్రదేశాలతో పోల్చుకుంటే మన దేశంలో స్టెమ్‌ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) మహిళా విద్యార్థులు అధికంగా ఉన్నారని, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

పరిశోధన రంగానికి అతి తక్కువ నిధులు ఖర్చు చేస్తున్నది మనదేశమేనని, జీడీపీలో కేవలం 0.7 శాతం మాత్రమే ఖర్చు చేస్తున్నట్లు ప్రస్తావించారని తెలిపారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని పెంచవలసిన అవసరముందని పేర్కొన్నారు. సైన్స్, అంతరిక్ష పరిశోధనలు సరిహద్దులు దాటాలంటే ప్రయోగాలు పెరగాలని శ్రీకృష్ణ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం ప్రపంచపటంలో నిలబడాలంటే ప్రయోగాల్లో ముందంజలో ఉండాలని అన్నారు. భారతదేశంలో ఏదైనా సాధ్యమవుతుందని రేపటి తరానికి నిరూపించాలంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రయోగాలు పెరగాలని నొక్కి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement