లోక్‌సభలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగంలో ప్రస్తావన
అతిపెద్ద, చీకటి అధ్యాయంగా పేర్కొన్న రాష్ట్రపతి
అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విపక్షాలు
ప్రజల దృష్టి మళ్లించేందుకే బీజేపీ యత్నాలు
రాష్ట్రపతి ప్రసంగంలో వ్యాఖ్యలను తప్పుబట్టిన సీనియర్ లీడర్
ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ అంశం లోక్‌సభ సమావేశాలను కుదిపేస్తోంది. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో ఎమర్జెన్సీని ప్రస్తావించారు. ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ.. దేశంలో అతిపెద్ద, చీకటి అధ్యాయం అని, రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడి అని ముర్ము వ్యాఖ్యానించారు. దీంతో ఈ అంశం ప్రస్తుతం దుమారం చెలరేగింది. విపక్షాలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అత్యయిక స్థితిపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. ఎమర్జెన్సీ విధింపు అప్రజాస్వామికం కావొచ్చేమో కానీ, రాజ్యంగ విరుద్ధం మాత్రం కాదని అన్నారు. అయితే.. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వ చర్యలను మాత్రం ఆయన తీవ్రంగా ఖండించారు.
అలా అనడం కరెక్ట్ కాదు..
ఎమర్జెన్సీని తాను విమర్శిస్తానని.. ఆ చర్యను సమర్థించడం లేదన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం, మీడియాపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యతిరేకమని భావిస్తున్నట్లు చెప్పారు. ఎమర్జెన్సీ విధింపు అప్రజాస్వామికం కావొచ్చేమో కానీ.. రాజ్యాంగ విరుద్ధం మాత్రం కాదన్నారు. ఒకప్పుడు రాజ్యాంగంలో అంతర్గత ఎమర్జెన్సీ విధింపునకు నిబంధన ఉండేదని గుర్తు చేశారు. కాబట్టి అప్పట్లో ఆ నిర్ణయం రాజ్యాంగ బద్ధమేనని అన్నారు. ప్రస్తుతం దాన్ని తొలగించారని పేర్కొన్నారు. కాబట్టి, చట్టపరంగా చూస్తే ద్రౌపది ప్రసంగంలో ఎమర్జెన్సీ రాజ్యాంగ విరుద్ధమనడం సరికాదని వ్యాఖ్యానించారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ యత్నాలు..
ఎమర్జెన్సీ పేరిట ప్రజల దృష్టి అసలు సమస్యలపై నుంచి మళ్లించేందుకు బీజేపీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందంటూ శశిథరూర్ ధ్వజమెత్తారు. 49 ఏళ్ల నాటి ఘటనను బీజేపీ మళ్లీ ఎందుకు తిరగదోడుతోందని ప్రశ్నించారు. వాస్తవం గురించి మాట్లాడకుండా బీజేపీ 2047 లేదా 1975 నాటి ఘటనల గురించే మాట్లాడుతోందని విమర్శించారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ఎన్డీయే సర్కార్‌కు ఈ సందర్భంగా శశిథరూర్ సూచించారు.