అంబానీ, అదానీ నుంచి కాంగ్రెస్‌కు ఎంత ముట్టింది?’ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. మోదీ జీ.. అంబానీ, అదానీ డబ్బు పంపుతున్నారని వ్యక్తిగత అనుభవంతో మాట్లాడుతున్నారా? అంటూ గురువారం కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలోని వేములవాడలో జరిగిన ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ.. తెలంగాణ గడ్డ నుంచి నేను ఒకటి అడగాలనుకుంటున్నా. గడచిన ఐదేళ్లుగా అదానీ, అంబానీపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్.. ఎన్నికల ప్రక్రియ మొదలుకాగానే ఎందుకు మౌనం దాల్చిందో స్పష్టం చేయాలి. అదానీ, అంబానీ నుంచి ఎన్ని టెంపోల్లో ధనం ముట్టింది? ఏం ఒప్పందం కుదిరింది? రాత్రికి రాత్రే అంబానీ, అదానీపై ఆరోపణలు ఆగిపోయాయి’ అని ప్రశ్నించారు.
ఆ టెంపోల నిండా డబ్బులు ఎవరికి చేరినయ్..
ప్రధాని మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తిప్పికొట్టారు. మోదీ జీ.. మీరు భయపడుతున్నారా? సాధారణంగా అదానీ, అంబానీ గురించి బహరింగంగా మాట్లాడరు. డోర్లు మూసి ఉన్నప్పుడే వారి గురించి ప్రస్తావిస్తారు. కానీ, మొదటిసారి మీరు వారి గురించి బహిరంగంగా మాట్లాడారు. వారు టెంపోల నిండా డబ్బులు పంపుతారని మీకు తెలుసు. అది మీ వ్యక్తిగత అనుభవమా? అని రాహుల్ ప్రశ్నించారు. ఆ ఇద్దరు పారిశ్రామిక వేత్తల వద్దకు ఇంతకాలం దూరంగా ఉన్న కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, ఐటీ, సీబీఐని పంపించి వీలైనంత త్వరగా విచారణ జరిపించండి అని సవాల్ విసిరారు. బీజేపీ అవినీతి టెంపోకు డ్రైవర్ ఎవరో, హెల్పర్ ఎవరో దేశం మొత్తానికి తెలుసు అన్నారు.