ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. సోమవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ఇద్దరు మహిళా మావోయిస్టులు చనిపోయారు.
దీంతో రెండు రోజులుగా సాగుతున్న ఎదురుకాల్పుల్లో మొత్తం 14 మంది మరణించినట్లయింది.
సోమవారం సాయంత్రం నుంచి గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో ఛత్తీస్‌గఢ్, ఒడిశా భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గరియాబంద్ అటవీ ప్రాంతంలో పోలీసులకు నక్సల్స్ తారసపడ్డారు. దీంతో ఇరుపక్షాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మరణించారు.
అదేవిధంగా నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మృతిచెందగా, కోబ్రా బెటాలియన్‌కు చెందిన ఓ జవాన్ గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌లో గరియాబంద్ డీఆర్‌జీ, ఒడిశా ఎస్‌వోజీ దళాలు, 207 కోబ్రా బెటాలియన్, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.