అమరావతి, ఆంధ్రప్రభ: పాలిటెక్నిక్ విద్యార్ధులకు తక్షణ ఉపాధి చూపాలన్న లక్ష్యం మేరకు సాంకేతిక విద్యా శాఖ నిర్వహిస్తున్న జాబ్ మేళాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆ శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గత మూడు రోజులుగా నగరంలోని ఐలాపురం కన్వెన్షన్ సెంటర్‌లో మేధా సర్వో డ్రైవ్స్ ద్వారా నిర్వహించిన జాబ్ మేళాలో 48 మంది సర్వీస్ ఇంజనీర్ ట్రైనీలుగా, 29 మంది విద్యార్థులు అప్రెంటిస్‌లుగా ఎంపికయ్యారన్నారు. రాత పరీక్షలో అర్హత సాధించిన బాలికలకు త్వరలో హైదరాబాద్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారన్నారు. మొత్తం 218 మంది విద్యార్థులు మేళాకు హాజరుకాగా, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్రల్ విభాగాలలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఉపాధి పొందగలిగారన్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డిప్లమా విద్యార్ధులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా సాంకేతిక విద్యాశాఖ అన్ని చర్యలు తీసుకుంటు-ందన్నారు. విశాఖలో మరో విడత జాబ్ మేళాను నిర్వహించాలని సాంకేతిక విద్యాశాఖ ప్రతిపాదించగా సంస్ధ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారని చదలవాడ నాగరాణి వివరించారు. జాబ్ మేళా నిర్వహణకు సంబంధించి సాంకేతిక విద్యాశాఖ నుండి డిప్యూటీ- డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ, ఓఎస్ డిలు తిప్పేస్వామి, ఛైతన్య , మేధా సర్వో నుండి కస్టమర్ సపోర్ట్ అధిపతి మురళీధర్, అసిస్టెంట్ మేనేజర్ శివన్న తదితరులు కార్యక్రమాలను సమన్వయపరిచారు.