హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్-2023 పరీక్షలు రేపటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈనెల 10 నుంచి 14వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రోజుకు రెండు సెషన్‌లలో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 104, ఆంధ్రప్రదేశ్‌లో 33 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ బి.డీన్ కుమార్ వెల్లడించారు. మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష, మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా సమయానికి ఒక గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. ఉదయం సెషన్ వాళ్లకు ఉదయం 7.30 గంటల నుంచి, మధ్యాహ్నం సెషన్ వారికి 1.30 గంటల నుంచి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలు తీసుకుని, క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత లోనికి పంపిస్తారు. హాల్‌టికెట్‌పై పొందుపరిచిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. విద్యార్థులకు కేటాయించిన తేదీ, సమయంలోనే పరీక్షలకు అనుమతిస్తామని పేర్కొన్నారు. ఆ సమయానికి రాకపోతే ఇతర సెషన్లకు అనుమతించే ప్రసక్తే లేదని వెల్లడించారు. ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. దాదాపు 3.20లక్షలకుపైగా అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకాబోతున్నారు. ఇదిలా ఉంటే ఎంసెట్ పరీక్షలు సజావుగా జరిగేందుకు పోలీసు, విద్యుత్, ఆర్టీసీ, ఇతర అధికారులు సహకారం అందించాలని ఎంసెట్ కన్వీనర్ ఈమేరకు కోరారు.