Friday, November 22, 2024

Elon Musk: ఐక్య‌రాజ్య‌స‌మితి పై ప్ర‌పంచ కుబేరుడు ఫైర్‌… భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై విమ‌ర్శ‌లు

ఐక్య‌రాజ్య స‌మితి పై టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్ ఫైర్ అయ్యారు. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. శక్తిమంతమైన దేశాలు తమ సభ్యత్వాన్ని వదులుకోలేక పోతున్నాయంటూ మండిప‌డ్డారు.

ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ఇటీవల ‘ఎక్స్‌ (ట్విటర్‌)’ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. భద్రతా మండలిలో ఏ ఆఫ్రికా దేశానికీ శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సంస్థలు నేటి ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలని, 80 ఏళ్ల కిందటి మాదిరిగా ఇప్పటికీ కొనసాగకూడదని అభిప్రాయపడ్డారు. దీంతో భద్రతా మండలిలో దేశాల శాశ్వత సభ్యత్వంపై చర్చ మొదలైంది.

ఈ పోస్ట్‌కు అమెరికాకు చెందిన పెట్టుబడిదారు మైఖెల్‌ ఐసెన్‌బర్గ్‌ బదులిస్తూ.. ‘మరి భారత్‌ సంగతేంటీ?’ అని ప్రశ్నించారు. దీనికి ఎలాన్‌ మస్క్‌ స్పందిస్తూ.. ”ఐరాస, దాని అనుబంధ సంస్థలను సవరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదం. శక్తిమంతమైన దేశాలు తమ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడకపోవడమే అసలు సమస్య. ఆఫ్రికా యూనియన్‌కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి” అని అభిప్రాయపడ్డారు.

- Advertisement -

ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా 1945లో ఐరాస ఆవిర్భవించింది. దీనికి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి ఏడున్నర దశాబ్దాలు దాటిపోయింది. నాటి నుంచి ఇప్పటి వరకు భద్రతా మండలిలో మాత్రం ఎలాంటి మార్పులూ చోటుచేసుకోలేదు. వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలుగా అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌లే కొనసాగుతున్నాయి. శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ పట్టుబడుతున్నా.. అందుకు అనుగుణంగా ఎలాంటి మార్పులు జరగట్లేదు. ఐదింట నాలుగు దేశాలు భారత్‌కు అనుకూలంగానే ఉన్నా.. ఒక్క చైనా మాత్రం మోకాలడ్డుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement