Tuesday, November 26, 2024

Delhi | రైల్వే లైన్ల విద్యుధీకరణ దాదాపు పూర్తి : కేంద్రం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశవ్యాప్తంగా 2023లో 6,577 కి.మీ మేర రైల్వే లైన్లకు విద్యుదీకరణ పూర్తయిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో దేశంలోని మొత్తం రైల్వే లైన్లలో 93.88% మేర విద్యుదీకరణ పూర్తయిందని వెల్లడించింది. 2014 నాటికి దేశంలో కేవలం 21,801 కి.మీ బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్లకు మాత్రమే విద్యుదీకరణ పూర్తవగా, ఇప్పుడు దేశంలోని మొత్తం 65,556 కి.మీ బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్లలో సుమారు 94 శాతం మేర విద్యుదీకరణ పూర్తిచేసుకుంది.

దేశంలోని మొత్తం రైల్వే బ్రాడ్‌గేజ్ నెట్‌వర్క్‌ను విద్యుదీకరించాలన్న ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం పరుగులు తీస్తోంది. విద్యుదీకరణ ద్వారా రైల్వేల నిర్వహణ వ్యయం తగ్గుతుందని, భారీ సరకు రవాణాతో పాటు సుదూర తీరాలకు ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లను నడపడానికి ఆస్కారం ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది.

డీజిల్ ఇంజిన్లతో పోల్చితే అధిక సామర్థ్యాన్ని, పనితీరును రైల్వే ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ కలిగి ఉంటాయని వివరించింది. అలాగే పర్యావరణానికి సైతం ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్ కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లదని వెల్లడించింది. వీటన్నింటితో పాటు డీజిల్‌తో నడిచే రైళ్ల కారణంగా దిగుమతి చేసుకోవాల్సిన చమురు దిగుమతి భారం కూడా తగ్గుతుందని కేంద్రం వెల్లడించింది. తద్వారా పెద్దమొత్తం విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసుకోవచ్చని కూడా పేర్కొంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement