హైదరాబాద్, ఆంధ్రప్రభ : ద.మ.రైల్వే 2022-23లో తన నెట్వర్క్‌ను విద్యుదీకరించడంలో భాగంగా అత్యుత్తమ పనితీరును నమోదు చేసింది. జోన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో 1017 రూట్ కి.మీ.ల రైల్వే విద్యుదీకరణ పనులను రికార్డు స్థాయిలో పూర్తి చేసింది. ఇది చరిత్రలో అత్యుత్తమమైన రికార్డ్. భారతీయ రైల్వేలో ఏ జోన్‌లో పోల్చినా విద్యుదీకరణలో అత్యధిక రూట్ కి.మీ.లు సాధించిన ఘనత కూడా ఇదే కావడం గమనార్హం. కాగా, ద.మ.రైల్వే 1017 రూట్ కి.మీ.ల విద్యుదీకరణలో 286.4 కి.మీ.లు తెలంగాణ పరిధిలోకి వస్తాయి. 133.7 రూట్ కి.మీ.లు ఏపీ పరిధిలో, 546 రూట్ కి.మీ.లు మహారాష్ట్ర పరిధిలోకి వస్తాయి. ద.మ.రైల్వే విద్యుదీకరణ పూర్తి చేసిన రూట్ కి.మీ.లలో తెలంగాణ ప్రాంతంలో భువనపాలెం-సత్తుపల్లి, మనోహరాబాద్-నిజామాబాద్, మహబూబ్‌నగర్-ఆలంపూర్ రోడ్డు, కోసాయి-అంబారి, జాన్కంపేట-బాసర ఉన్నాయి.
ఏపీ పరిధిలో ధర్మవరం-కదిరి, ఆరావళి-నిడుదవోలు, న్యూపిడుగురాళ్ల-శావల్యపురం, ఆలంపూర్-కర్నూలు ఉన్నాయి. ఈ సందర్భంగా ద.మ.రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ మాట్టాడుతూ విద్యుదీకరణ పనులు పూర్తి చేయడంలో అద్భుతమైన టీం వర్క్, అంకితభావంతో పని చేసిన జోన్‌లోని సిబ్బంది, అధికారులను అభినందించారు. విద్యుదీకరణ పనులు వేగంగా జరగడం వల్ల రికార్డు విద్యుదీకరణ సాధించడమే కాకుండా, జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. నెట్వర్క్‌లోని ప్రధాన భాగం విద్యుదీకరించడం వల్ల జోన్ పరిధిలోని బ్రాడ్‌గేజ్ లైన్లలో వంద శాతం విద్యుదీకరణను సాధించే దిశగా పురోగమిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
అక్రమంగా తరలిస్తున్న రూ.67.5 లక్షల విలువైన స్మగ్లింగ్ సిగరెట్లు స్వాధీనం
పాన్ ఇండియా డ్రైవ్‌లో భాగంగా ద.మ.రైల్వే క్రైమ్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇన్‌పుట్స్ ఆధారంగా హైదరాబాద్ రైల్వే స్టేషన్‌లో రూ.67.50 లక్షల విలువైన స్మగ్లింగ్ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ద.మ.రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సిహెచ్ రాకేశ్ వెల్లడించారు. అందిన సమాచారం మేరకు బహిరంగ మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా ప్రతీ సిగరెట్ స్టిక్‌న రూ.15 నుంచి 20కి విక్రయిస్త్తుంటారని తెలిసిందనీ, దీన్ని బట్టి స్మగ్లింగ్ సిగరెట్ల మొత్తం విలువ రూ. 67.50 లక్షలు వుంటుందని అంచనా వేయడం జరిగిందన్నారు. తప్పుడు పేరుతో పార్సెల్‌ను బుక్ చేసిన వ్యక్తిపై ఆర్పీఎఫ్ హైదరాబాద్ వారు రైల్వే చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ ఘటనపై ద.మ.రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజి రాజారాం స్పందిస్తూ భారత ఆర్థిక వ్యవస్థలోని అనేక అంశాలను ప్రభావితం చేసే అక్రమ సిగరెట్ల స్మగ్లింగ్ ఎంతో ఆందోళన కలిగిస్తోందనీ, రాబోయే రోజుల్లో నిషేధిత వస్తువల రవాణాను అరికట్టడానికి మరింత నిఘా పెంచుతామని స్పష్టం చేశారు.