మన దేశానికి నేపాల్ విద్యుత్ ఎగుమతిని శనివారం నుంచి ప్రారంభించింది. నేపాల్‌లో జల విద్యుత్ భారీగా జరుగుతోంది. నేపాల్‌లో వర్షాకాలం ప్రారంభం కావడంతో విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. గత సంవత్సరం కూడా నేపాల్ మన దేశానికి జూన్ నుంచి నవంబర్ వరకు విద్యుత్‌ను ఎగుమతి చేసింది. శనివారం నుంచి తాము ఇండియాకు 600 మెగావాట్ అవర్ విద్యుత్‌ను ఎగుమతి చేస్తున్నట్లు నేపాల్ ఎలక్ట్రిసిటి అథారిటీ ప్రతినిధి సురేష్ భట్టారీ తెలిపారు. దేశంలో ప్రస్తుతం మిగులు విద్యుత్ ఉందని ఆయన తెలిపారు.
గతంలో నేపాల్ మన దేశం నుంచి 400 మెగావాట్ల విద్యుత్‌ను దిగుమతి చేసుకుంది. నేపాల్‌లో చలికాలంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ కాలంలో విద్యుత్‌ను మన దేశానికి ఎగుమతి చేయడంలేదు. నేపాల్‌లో జలవిద్యుత్ ప్రాజెక్ట్‌లు చాలా వరకు నదులపైనే ఉన్నాయి. గత సంవత్సరం మన దేశానికి విద్యుత్ ఎగుమతి చేయడం ద్వారా నేపాల్ 12 బిలియన్ రూపాయల ఆదాయం పొందింది. నేపాల్‌లో వర్షాల సీజన్ ప్రారంభం కావడం వల్ల అన్ని నదుల్లోనూ నీటి మట్టాలు పెరుగుతున్నాయి. దీంతో జల విద్యుత్ ఉత్పత్తి పెరిగింది.