Wednesday, November 20, 2024

విద్యుత్‌ చార్జీలు పెంపు ఎందుకంటే…!

నష్టాల్లో ఉన్న విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కంలు)ను గట్టెక్కేంచేందుకు విద్యుత్‌ చార్జీల పెంపు అనివార్యమైంది. ఐదారేళ్లుగా వినియోగ దారులపై భారం వేయని ప్రభుత్వం.. ఈ ఏటా తప్పనిసరి పరిస్థితుల్లో అతి తక్కువలో చార్జీల భారం వేయాల్సి వస్తుందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ చార్జీల పెంపునకు సంబంధించిన ఆవశ్యకతపై ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్‌గా వినియోగదారుల్లో ముందుగానే అవగాహన కల్పించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నది. వచ్చే ఏడాదిలో రూ.10,928 కోట్ల లోటు ఏర్పడే అంచనా ఉండగా.. చార్జీల పెంపు ద్వారా రూ.6,831 కోట్లు సమకూర్చుకోవాలనే ఆలోచనతో డిస్కంలు ఉన్నాయి. గృహ వినియోగదారులపై పెద్దగా భారం పడకుండా ప్రతి యూనిట్‌కు స్వల్ఫంగా 50 పైసల చొప్పున, గృహేతర కేటగిరీల వారికి ప్రతి యూనిట్‌కు రూ.1 చొప్పున టారీఫ్‌ పెంచేందుకు అనుమతి ఇవ్వాలని ఈఆర్‌సీకి డిస్కంలు విన్నవించుకున్న విషయం తెలిసిందే. అయితే చార్జీల పెంపునకు సంబంధించి ఈఆర్‌సీ ఫిబ్రవరిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ప్రభుత్వం కూడా ప్రజల్లో ముందుగానే అవగాహన కల్పించాలనే అభిప్రాయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది.

పీపీఏల రద్దుతో అదనపు భారం..

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు విద్యుత్‌ సంస్థ తమ సామర్థ్యాన్ని పెంచుకున్నది. 2014 వరకు 7,778 మెగావాట్ల సామర్థ్యం ఉండగా.. రూ.33,722 కోట్ల ఖర్చుతో 16,623 మెగావాట్లకు పెరిగింది. వీటితో పాటు గ్రీన్‌ఎనర్జీ సెస్‌, పెరిగిన బొగ్గు ధరలు, రైల్వే రవాణా చార్జీల పెంపు, రెన్యువల్‌ పవర్‌ పర్చేజ్‌ ఆబ్లిగేషన్‌ (ఆర్‌పీపీ) వంటి కేంద్ర ప్రభుత్వం చర్యలతో ప్రతి ఏటా అదనంగా డిస్కంలపై రూ.725 కోట్ల భారం పడుతోంది. రాష్ట్ర విభజన సమయంలో సీలేరు, కృష్ణపట్నం విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల పీపీఏల రద్దుతో తెలంగాణపై రూ.2,763 కోట్ల అదనపు భారం పడింది. తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఈ లోటును పూడ్చుకోవడం కోసం బహిరంగ మార్కెట్‌లో అత్యధిక ధరలకు విద్యుత్‌ కోనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ జెన్‌కో, ఇతర సంస్థల నుంచి రావాల్సిన విద్యుత్‌ను నిలిపివేయడంతో తెలంగాణ డిస్కంలపై రూ.2502 కోట్లు అదనపు భారం మోయాల్సి వచ్చింది.

పెరిగిన తలసరి విద్యుత్‌ వినియోగం..

విద్యుత్‌ వ్యవస్థ పటిష్టత కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా గత ఐదా రేళ్లుగా విద్యుత్‌ చార్జీలు పంచకపోవడంతో విద్యుత్‌ సంస్థల ఆదాయ వ్యయ వ్యత్యాసాల్లో భారీ లోటు కనిపిస్తంది. రాష్ట్రం ఏర్పడే నాటికి 1356 యూనిట్లుగా ఉన్న తలసరి విద్యుత్‌ వినియోగం 2021 నాటికి 2012 యూనిట్లకు పెరిగింది. దేశ తలసరి వినియోగం 1161 యూనిట్లు మాత్రమే ఉన్నది. దేశ తలసరి వినియోగంతో పోల్చితే తెలంగాణ రెట్టింపు స్థాయిలోకి వెళ్లింది. విద్యుత్‌ వినియోగదారుల సంఖ్య కూడా 2014 నాటికి 11 లక్షలు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 1 కోటి 68 లక్షలకు పెరిగింది. విద్యుత్‌ గరిష్ట డిమాండ్‌ 5,661 మెగావాట్ల నుంచి ప్రస్తుతం 13,688 మెగావాట్ల వరకు చేరుకున్నది. డిస్కంలకు ఉన్న రూ.12,185 కోట్ల నష్టాలను కూడా గత ఏడేళ్లు గా అధిగమించలేకపోయింది. రాష్ట్ర విభజన నాటికి విద్యుత్‌ సరఫరా డిమాండ్‌ గ్యాప్‌ 2700 మెగావాట్లు ఉండేది. దీంతో కేవలం గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే ప్రతి రోజు మూడు నుంచి ఆరు గంటల వరకు విద్యుత్‌ కోతలు ఉండేవి. ఈ ఏడేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం వాటన్నింటిని అధిగమించి విద్యుత్‌ రంగం అద్బుతమైన ప్రగతిని సాధించింది.

- Advertisement -

సేద్యానికి ఉచిత విద్యుత్‌..

వ్యవసాయ వినియోగదారులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌, 200 యూనిట్ల వరకు గృహ వినియోగదారులకు సడ్సిడీ, ఎస్సీ, ఎస్టీలకు 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరాతో ఏటా రూ.1253 కోట్లు ఖర్చు చేస్తున్నది. దోబీఘాట్లకు, హెయిర్‌ సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్‌ సరఫరా, పవర్‌లూమ్‌, కోళ్ల ఫారాలకు సబ్సిడీ ధరలతో సరఫరా అందిస్తున్నాయి. వ్యవసాయ కనెక్షన్లు 2014కు కంటే ముందు 19.03 లక్షలు ఉండగా.. ప్రస్తుతం రూ.3,375 కోట్ల ఖర్చుతో వాటి సంఖ్య అదనంగా 6.89 లక్షల కనెక్షన్లను మంజూరు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు ప్రతి ఏటా రూ.3,200 కోట్లను ఖర్చు చేస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement