హైదరాబాద్, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో కాలుష్యాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 ఎలక్ట్రిక్ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో ఎక్కువ శాతం నెలాఖరు వరకు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా టెస్ట్‌రన్‌ను నిర్వహించి చార్జింగ్ కేంద్రాల పనితీరును పరిశీలించింది. ఈ స్టేషన్లలో ప్రస్తుతం కార్లను చార్జింగ్ చేసుకోవచ్చని తెలిపింది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టీఎస్ఐసీ, ఫుడ్ కార్పొరేషన్ల నుంచి సేకరించిన స్థలాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ స్టేషన్లలో వాహనదారుల సౌకర్యార్థం ఫుడ్ కోర్టులు ఇతరత్రా సౌకర్యాలు కల్పించనుంది.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ రెడ్కో) చైర్మన్ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ఈవీ చార్జింగ్ కేంద్రాల సమాచారం అంతా ఇక క్లిక్‌లోనే అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. టీఎస్ఈవీ యాప్‌లో వీటికి సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచామన్నారు. ఏయే ప్రాంతాల్లో చార్జింగ్ కేంద్రాలు ఉన్నాయి… దగ్గర ప్రాంతంలో ఎక్కడ చార్జింగ్ కేంద్రం ఉంది? ఒక్కో యూనిట్‌కు ఏ కంపెనీ ఎంత డబ్బులు వసూలు చేస్తుంది? వంటి వివరాలన్నీ ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయని చెప్పారు.
వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ పట్టణాలలో రానున్న కాలంలో 40 ఈవీ చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఈవీ చార్జింగ్ స్టేషన్లలో ధరలు తక్కువగా ఉంటాయనీ, చార్జింగ్ యూనిట్ల ధరను త్వరలోనే నిర్ధారిస్తామన్నారు. ప్రస్తుతం 50 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయనీ, త్వరలోనే మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వీటిని ప్రారంభిస్తామని రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి వెల్లడించారు.