Saturday, November 23, 2024

ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటాం : బీజేపీ ఎంపీ డా. లక్ష్మణ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటామని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు డా. కే. లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు తీరుపై విమర్శలు చేశారు. తెలంగాణలో పేదలకు ఇళ్లు నిర్మించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని ఆరోపించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించలేకపోయిందని దుయ్యబట్టారు.

కేసీఆర్ రైతులను సైతం దగా చేస్తున్నారని, మాయమాటలతో మోసగిస్తున్నారని విమర్శించారు. సొంత రాష్ట్రంలోనే రైతులకు ఏమీ చేయలేకపోయిన వ్యక్తి ఇప్పుడు దేశవ్యాప్త రైతాంగం కోసం పోరాడతానంటూ పార్టీ పేరు మార్చడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా అవుతుందని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ వైపు ఒక్కరూ కూడా కన్నెత్తి చూడలేదని అన్నారు.

ఇకపోతే తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని తెలిపారు. అసెంబ్లీ రద్దు చేయడం వరకే సీఎం కేసీఆర్ చేతుల్లో ఉంటుందని, ఎన్నికలు ఎప్పుడు పెట్టాలన్నది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తుందని తెలిపారు. కేసీఆర్ కుమార్తె కవిత మద్యం కుంభకోణం కేసు గురించి మాట్లాడుతూ.. అక్రమ సంపాదన లేనప్పుడు దర్యాప్తు సంస్థలకు భయపడాల్సిన పనిలేదని అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement