నాగార్జునసాగర్ ఉపఎన్నిక ఫలితం వచ్చేలోపే తెలంగాణలో త్వరలో మరో ఎన్నికల నగారా మోగనుంది. పాలక మండళ్ల పదవీకాలం ముగిసిన పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. సాగర్ బైపోల్ రిజల్ట్కు ముందే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సహా ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. వారం రోజుల్లోగా ప్రకటన విడుదల చేసి.. ఈనెల 30న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్లాన్ చేస్తోంది.
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు.. సిద్దిపేట, అచ్చంపేట, కొత్తూరు, జడ్చర్ల, నకిరేకల్ మున్సిపాలిటీలతో పాటుగా జీహెచ్ఎంసీలోని లింగోజిగూడ డివిజన్‌కు కూడా వీటితో పాటే ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఎన్నికలు జరిగే జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఎన్నికల సంఘ కమిషనర్ పార్థసారథి తాజాగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని సూచించారు. నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలకోడ్ అమల్లోకి వస్తుంది. లింగోజిగూడ డివిజన్‌కూ ఉప ఎన్నిక నిర్వహించాలని భావిస్తుండటంతో.. జీహెచ్ఎంసీ అంతటా 15 రోజులపాటు ఎన్నికల కోడ్ అమలులోకి రానుంది.