Friday, November 22, 2024

Meet The Press: ఈ ఎన్నికలే తెలంగాణ చివరి దశ ఉద్యమం కావాలి… రేవంత్‌రెడ్డి

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ కోసమే పోరాటం చేశారని, ఈ ఎన్నికలే తెలంగాణ చివరి దశ ఉద్యమం కావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మీట్‌ది ప్రెస్‌లో ఆయ‌న మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అడ్వకేట్ జనరల్ ను నియమించ లేదన్నారు. ప్రజాస్వామ్యంపై పోరాడుతూ కాంగ్రెస్ ప్రజల్లోనే ఉందన్నారు. భూమి కోసం తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు జరిగియని గుర్తు చేశారు.

కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలన్నారు. గతంలో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ సంక్షోభాన్ని ఎదుక్కొందని తెలిపారు. కేసీఆర్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ, సమన్యాయం లేదంటూ విమర్శించారు. హక్కుల కోసం తెలంగాణ ప్రజలు మరోసారి ఉద్యమించాల్సిన పరిస్థితి వచ్చిందని పిలుపునిచ్చారు. నాలుగు కోట్ల ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, అభివృద్ది ఇచ్చేందుకు కాంగ్రెస్ మ్యానిఫెస్టో రూపొందించిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజాదర్భార్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పదేళ్లలో ప్రజలను బానిసలుగా చూసే పాలన సాగిందని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తుదిదశ ప్రజా ఉద్యమంలో మీడియా పాత్ర కీలకం కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంతాలను భట్టి ప్రాధాన్యతలు మారుతాయని, సిఎం కెసిఆర్ ఇచ్చే ఫించన్ల కంటే కర్నాటకలో ఎక్కువ ఇస్తున్నారని, మేనిఫేస్టోలో బిఆర్‌ఎస్ ఐదు వేల రూపాయలు ఇస్తామని పెట్టిందని, తొమ్మిదేళ్ల నుంచి ఎందుకు ఇవ్వలేదని రేవంత్ అడిగారు. ఎస్‌సి వర్గీకరణపై గతంలోనే బిజెపి హామీ ఇచ్చిందని, కెసిఆర్ కుటుంబ పెత్తనాన్ని ఇన్నాళ్లు ప్రజలు భరించారని, నిజాం తరహా పాలన ఇన్నాళ్లు కొనసాగిందని విమర్శలు గుప్పించారు. నిజాం హయాం నుంచి జరిగిన పోరాటాలు భూమి కోసమేనని, నిజాం పాలనలో ఆకలిని భరించారు కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదని రేవంత్ పేర్కొన్నారు. సమైక్య పాలనలో మనపై ఆధిపత్యం కొనసాగిందని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement