హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 6 తర్వాత 10తేదీలోగా ఎప్పుడైనా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేయనుందని విశ్వసనీయంగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పథకాలు, హామీల జోరు పెంచింది. పెండింగ్ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లను ప్రకటిస్తున్న సర్కార్ ఉద్యోగులకు పీఆర్సీ కమిటీని, ఐఆర్‌ను ప్రకటించింది. అంగన్‌వాడీలను పీఆర్సీ పరిధిలో చేర్చింది.
ఈ రెండు మూడు రోజుల్లో మరిన్ని కీలక నిర్ణయాలను, వరాలను గుప్పించేందుకు సీఎం కేసీఆర్ ఉద్యుక్తులవుతున్నారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభమైన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం రాక ప్రాధాన్యత సంతరించుకోగా ప్రభుత్వ వేగం కూడా ఎన్నికల షెడ్యూల్ త్వరతగతిని రుజువు చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల మూడు రోజుల పర్యటన ముగిసిన వెంటనే ఈ బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించనుంది.
దీని ఆధారంగా సీఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను జారీ చేయనున్నది. షెడ్యూల్ జారీ నుంచి ఎన్నికలకు 2 నెలల సమయాన్ని నిర్దేశించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ నేపత్యంలో ఏదేమైనా ఈ నెల 10 దాటకుండా షెడ్యూల్ జారీకే సీఈసీ మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 5నుంచి 10లోగా షెడ్యూల్ ఖరారు కానుంది. తద్వారా డిసెంబర్ రెండో వారంలోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రణాళికలు రూపొందిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ గడువు 2024 జనవరి 16 వరకు ఉంది. 2014లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఉమ్మడి రాష్ట్రంలోనే చివరి ఎన్నికలు జరిగాయి. కానీ, ఐదేళ్లు పూర్తి కాకుండానే కేసీఆర్ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దీంతో 2018 అక్టోబర్ 6న ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. సరిగ్గా రెండు నెలలకు అంటే డిసెంబర్ 7న పోలింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యేలంతా జనవరి 17న అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో జనవరి 16వ తేదీ వరకు ప్రస్తుత అసెంబ్లీ మనుగడ సాగించే అవకాశం ఉంది.
వీటికి కూడా…
తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాల్ర అసెంబ్లీలకు కూడా ఒకేసారి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ముందు కేంద్ర ఎన్నికల సంఘం రెండు సార్లు రాష్ట్రంలో పర్యటించనుంది. ఇప్పటికే ఒక దఫా పూర్తికాగా, ఇది రెండో పర్యటనగా భావిస్తున్నారు. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించడానికి ఓసారి, నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత మరోసారి సీఈసీ బృందం రాష్ట్రాన్రికి రానుంది. బుధవారం ఓటర్ల తుది జాబితాను ప్రకటించిన తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు ఎన్నికల సన్నద్ధతను స్వయంగా పరిశీలించడానికి సీఈసీ బృందం రాష్ట్రాల్లో పర్యటనలు నిర్వహిస్తుంది. ఆ తర్వాత షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల్రకుగాను.. తెలంగాణ మినహా మిగతా 4 రాష్ట్రాల్ల్రో ఇప్పటికే సీఈసీ బృందం పర్యటనలు ముగిశాయి. ఈ నెల 5నాటికి తెలంగాణలోనూ పర్యటన ముగుస్తుంది. అంటే ఆ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం గత శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను 2018 అక్టోబర్ 6న ప్రకటించగా.. అదే ఏడాది డిసెంబర్ 7న పోలింగ్, 11న ఫలితాలను ప్రకటించారు.
అక్టోబర్ 5న ఓటర్లలో చైతన్యం కల్పించడానికి అమలు చేస్తున్న ‘స్వీప్’ కార్యక్రమం తీరు తెన్నులను సీఈసీ బృందం పరిశీలిస్తుంది. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రచారకర్తలుగా ఉన్న క్రీడా, సినీ రంగ సెలబ్రిటీ-లతో సమావేశం అవుతుంది. దివ్యాంగ, యువ ఓటర్లతో ముఖాముఖీగా మాట్లాడుతుంది. చివరిగా ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌లతో సమావేశమై రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం, భద్రత సంస్థలను సమన్వయం పర్చే అంశంపై సమీక్షిస్తుంది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి తమ పర్యటన విశేషాలను వెల్లడిస్తుంది.