ఎన్నికల్లో వరుస ఓటముల నేపథ్యంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్‌లో సంస్థాగత ఎన్నికల కసరత్తు మొదలైంది. వచ్చేనెలలో ఎన్నికలు నిర్వహించనుండా ప్రస్తుతం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఊపందుకుంది. శుక్రవారం నాటికి 2.6 కోట్లమంది డిజిటల్ విధానంలోను, మరో 3 కోట్లమంది ఆఫ్‌లైన్‌లోనూ కాంగ్రెస్ సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా పలువురు ప్రముఖులు సభ్యత్వ నమోదు గడువు ముగుస్తున్న నేపథ్యంలో చివరి నిమిషంలో శుక్రవారంనాడు దరఖాస్తు చేసుకోవడం విశేషం. పార్టీని కిందిస్థాయి నుంచి, అన్ని విభాగాల్లో ప్రక్షాళన చేయాలని భావించి ఈ కసరత్తు మొదలుపెట్టారు. ఇన్నాళ్లూ పార్టీ సభ్యత్వం కార్యక్రమంగాని, ఎన్నికల తంతుగాని తూతూమంత్రంగాను, బోగస్ సభ్యులతో కొనసాగేదన్న విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఇంత స్థాయిలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం ఇదే ప్రథమం. ప్రత్యేకంగా తయారు చేసిన కాంగ్రెస్ సభ్యత్వ యాప్ ద్వారా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నాయకులకైనా, కార్యకర్తలకైనా ఇందులో మినహాయిపు లేదు. డిజిటల్ విధానంలో దరఖాస్తు చేసుకున్నవారి వివరాలను నాలుగు దశల్లో పరిశీలిస్తారు.
మొదట సభ్యత్వాన్ని నమోదు చేసే వ్యక్తి, ఆ తరువాత దరఖాస్తు దారుని ఫోన్‌నెంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారాను, ఆ దరఖాస్తుదారుని ఓటరు గుర్తింపుకార్డు సంఖ్యను యాప్ ద్వారాను, అతడి ఫోటోను పార్టీ యంత్రాంగం గుర్తించాకే సభ్యత్వాన్ని ఖరారు చేస్తూ డిజిటల్ ఐడెంటిటీ కార్డు ఇస్తారు.అలా ఐడీకార్డు పొందినవారు మాత్రమే సంస్థాగత ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులు.ఆఫ్‌లైన్‌లోనూ ఇదే తరహాలో వడపోత ఉంటుంది. బీజేపీలో అమిత్ షా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనుసరించిన మిస్‌డ్ కాల్ మెంబర్‌షిప్ డ్రైవ్‌కు కొంత భిన్నంగా ఇప్పుడు కాంగ్రెస్ సభ్యత్వ కార్యక్రమం కొనసాగుతోంది. కాగా 20 రాష్ట్రాల నుంచి 2.6 కోట్లమంది డిజిటల్ విధానంలో సభ్యత్వంకోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవలే ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలకు చెందిన కార్యకర్తలు ఈ సభ్యత్వ కార్యక్రమంలో పాలుపంచుకోవడం లేదు. ప్రధానంగా కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌నుంచి 55 శాతం , మహారాష్ట్ర నుంచి 12 శాతం మంది సభ్యత్వం కోసం దరఖాస్తు చేసినవారిలో ఉన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..