Tuesday, November 26, 2024

TS | ఎన్నిక‌ల ప్ర‌క్రియ వేగ‌వంతం.. ఆర్వో, ఏఆర్వోల నియామకం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలకు ఎన్నికల అధికారులను, 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు రిటర్నింగ్‌ అధికారులను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఓటర్ల జాబితాలో ఏవైనా లోపాలను సరిదిద్దడానికి ఎన్నికల సంఘం ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ పేర్కొంది.

తెలంగాణ సీఈవో సమర్పించిన జాబితా ఆధారంగా రిటర్నింగ్‌ అధికారుల నియామకాన్ని పరిశీలించి ఖరారు చేసిన అనంతరం భారత ఎన్నికల సంఘం ప్రిన్సిపల్‌ సెక్రటరీ అవినాష్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. భారత ఎన్నికల సంఘం నుంచి అందిన ఆదేశాల మేరకు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాలకు రిటర్నింగ్‌ అధికారుల నియామకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి మెమో జారీ చేశారు సీఈవో తెలంగాణ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం చాలా అసెంబ్లీ నియోజకవర్గాలకు రెవెన్యూ డివిజనల్‌ అధికారులను రిటర్నింగ్‌ అధికారులుగా నియమించారు.

- Advertisement -

దీంతోపాటు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కోఆర్డినేటింగ్‌ అధికారి బాధ్యతను స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, జోనల్‌ కమిషనర్లకు అప్పగించారు. కొన్ని జిల్లాలకు సంబంధించి అదనపు కలెక్టర్లకు రిటర్నింగ్‌ అధికారుల బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో డివిజన్ల వారీగా అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారుల నియామకానికి కూడా ఆమోదం లభించింది. మెజారిటీ తహసీల్దార్లు ఏఆర్వోలుగా నియామకమయ్యారు. అలాగే గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు మున్సిపల్‌ అధికారులను నియమించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement