మునుగోడు ఉప ఎన్నికలో అవినీతి డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ప్రధాన పార్టీలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఎన్నికల ప్రక్రియను ఖూనీ చేస్తున్నాయని సోషల్ డెమోక్రటిక్ ఫోరమ్ రాష్ట్ర కన్వీనర్ విఅర్ఎస్ ఐఏఏస్ ఆకునూరి మురళి అన్నారు. ఆదివారం సోషల్ డెమోక్రటిక్ ఫోరమ్ అధ్వర్యంలో మునుగోడులో ఎన్నికల ప్రచార పక్రియను పరిశీలించారు. చౌటుప్పల్,సంస్ధనారయణపురంలలో కూలీలను రైతులను కలిశారు.గంగమల్లాతండా,వ్యాచ్చ తండా,టస్కనీగూడెం మర్రిబావి తండాలలో మూసివేసిన పాఠశాలలను పరిశీలించారు.
శివన్న గూడెంలో ఫ్లోరోసిస్ భాధితులను కలిశారు.లెంకలపల్లిలో ఓటర్లతో మాట్లాడారు. చండూర్ లో బిసి సంక్షేమ హస్టల్ ను పరిశీలించి విద్యార్థులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ…టిఅర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత నియోజకవర్గాలను వదిలేసి,మంత్రులు వాళ్ళ శాఖలను వదిలేసి ఇక్కడ తిష్ట వేసినందుకు వాళ్లకు ఈ నెల రోజుల జీతాన్ని చెల్లించకూడదని డిమాండ్ చేశారు.భారత ఎలక్షన్ కమిషన్ రోజు వారి ప్రతి అభ్యర్థి ఖర్చులను వెల్లడించాలని, డైలీ బులెటిన్స్ విడుదల చేయాలని కోరారు.
ఈ ఉప ఎన్నికలలో ప్రజా సమస్యలను చర్చకు రాకుండా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటు ప్రజలను మోసం చేస్తున్నారని అరోపించారు. ఎన్నికలను వ్యాపారంగా మార్చి విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్న పార్టీలను ఓడించాలని పిలుపు నిచ్చారు. డబ్బు,మద్యం పంపిణీని అరికట్టాలని ఎన్నికల కమీషన్ ను కోరారు.గత ఎనిమిది ఏళ్ళ విద్యా, వైద్యాన్ని విస్మరించిన టిఆర్ఎస్, ఫ్లోరొసిస్ రిసర్చ్ సెంటర్ ను బెంగాల్ కు తరలించిన బిజెపికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు.ఈ పర్యటనలో ఎస్.డి.ఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్‌లు ప్రొఫెసర్లు కె.లక్ష్మినారాయణ, రమ,డాక్టర్ ప్రధ్వీరాజ్,యం.అంజనేయులు, పి.శంకర్ తదితరులు పాల్గొన్నారు.