Friday, November 22, 2024

కాకరేపుతున్న టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నిక, రేపే నేడు పోలింగ్‌.. సర్వం సిద్ధం చేసిన అధికారులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: నేడు మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్‌ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎన్నికల అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. అయితే పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో పలువురు అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలింగ్‌ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగనుంది. ఉదయం నుంచే ఓట్లు వేసేందుకు కేంద్రాలకు ఓటర్లు తరలిరానున్నారు. 16న కౌంటింగ్‌ జరిపి ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ నియోజకవర్గంలో 29,720 మంది ఓటర్లు ఉన్నారు. 137 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సాఫీగా నడిచేందుకు సెక్టరోల్‌ అధికారులను, అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు.

- Advertisement -

ఓటింగ్‌కు ఇంకా కొద్ది గంటలే మిగిలి ఉండడంతో ఉపాధ్యాయ, అధ్యాపక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పలువురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ప్రలోభాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఎన్నికల బరిలో మొత్తం 21 మంది అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధాన పోటీ మాత్రం బీజేపీ అభ్యర్థి ఏవిఎన్‌ రెడ్డి, పీఆర్టీయూ టీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవ రెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ నుంచి కాటేపల్లి జనార్థన్‌రెడ్డి, యూటీఎఫ్‌ నుంచి మాణిక్‌రెడ్డి, ఎస్టీయూటీఎస్‌ నుంచి భుజంగరావు, బీసీటీఏ నుంచి విజయకుమార్‌ తదితరుల మధ్యనే ఉండనుందని టీచర్లు చెబుతున్నారు. ఈ రోజు పోలింగ్‌ ఉండడంతో ఎన్నికల నేపథ్యంలో 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు మూసే ఉంటాయి.

ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు: యూటీఎఫ్‌

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఉపాధ్యాయులకు నగదు, మద్యం పంపిణీ చేస్తూ ప్రలోభాలకు గురిచేస్తున్న అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని టీఎస్‌ యూటీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఈమేరకు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావ రవిలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. బరిలో ఉన్న ప్రధాన ఇద్దరు అభ్యర్థుల పక్షాన వారి అనుచరులు ఓటర్లకు మద్యం బాటిళ్లు, రూ.2000 నుండి రూ.5000 వరకు నగదు బదిలీ చేస్తూ ఓట్లు వేయాలని కోరుతున్నట్లు ఆరోపించారు. కేజీబీవీ, గురుకులాల ఉపాధ్యాయులకు ఆ ఇద్దరు అభ్యర్థులు నగదు పంపిణీ చేయబోగా పలువురు ఉపాధ్యాయులు తిరస్కరించినట్లు తెలిపారు. టీచర్లను ప్రలోభాలకు గురిచేస్తూ నైతికంగా దిగజార్చుతున్న అటువంటి అభ్యర్థులను ఓడించడం ద్వారా వారికి తగిన బుద్ధి చెప్పాలని వారు ఆదివారం ఒక ప్రకనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement