నందిగ్రామ్‌లో మమత ఓటమిని జీర్ణించుకోలేని తృణముల్ కాంగ్రెస్ నేతలు అక్కడ రీకౌంటింగ్ చేయాలని పట్టు బట్టారు.ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో సువేందు అధికారి 1736 ఓట్ల తేడాతో మమతను ఓడించిన విషయం తెలిసిందే. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం రీ కౌటింగ్ కుదరదని తేల్చిచెప్పింది. వీవీ ప్యాట్ స్లిప్స్‌ను లెక్కించిన తర్వాత ఫలితాన్ని అధికారికంగా ప్రకటిస్తామని రిటర్నింగ్ ఆఫీసర్ స్పష్టం చేశారు.
అయితే కౌంటింగ్ ప్రక్రియపై తృణమూల్ అనుమానాలు వ్యక్తం చేసింది. అంతేకాదు కోర్టుకు కూడా వెళ్తామని ముఖ్యమంత్రి మమత ప్రకటించారు. పార్టీ గెలుపు తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె.. నందిగ్రామ్‌లో ప్రజల తీర్పును గౌరవిస్తూనే.. ఎన్నికల సంఘం తీరుపై కోర్టుకు వెళ్తామని చెప్పారు. నందిగ్రామ్ ఫలితాల విషయంలో అటు ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ కూడా చాలా నిదానంగా అప్‌డేట్ చేస్తూ వచ్చింది. సోమవారం ఉదయం 9.40 నిమిషాలకు ఈసీ నందిగ్రామ్ ఫలితాన్ని పూర్తిగా అప్‌డేట్ చేసింది. మొత్తం 17 రౌండ్ల కౌంటింగ్ తర్వాత సువేందుకు 109673 ఓట్లు, మమతకు 107937 ఓట్లు వచ్చినట్లు తేల్చింది.