Saturday, November 23, 2024

హుజురాబాద్ ఉపఎన్నిక రోజే.. బద్వేల్ ఉపఎన్నిక

దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణలోని హుజురాబాద్‌ అసెంబ్లీ స్థానంతో పాటు.. ఏపీలోని బద్వేల్‌ అసెంబ్లీ స్థానానికి కూడా ఇదే షెడ్యూల్‌ వర్తించనుంది. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక జరుగుతుండగా.. ఈ ఎన్నికల్లో తన అభ్యర్థిగా దాసరి సుధాను వైసీపీ ప్రకటించింది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్‌ని బద్వేల్‌ అభ్యర్థిగా నిర్ణయించింది. మరోవైపు బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా? లేక విడివిడిగా బరిలోకి దిగుతాయా..? అసలు పోటీకే దూరంగా ఉంటాయా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. అక్టోబర్ 1వ తేదీన ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 1వ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8గా నిర్ణయించారు. అటు అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్‌ 13 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాగా.. అక్టోబర్ 30వ తేదీన ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్‌ నిర్వహించనున్నారు.. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. మరోవైపు ఉప ఎన్నికలపై కరోనా ఆంక్షలు విధించింది ఎన్నికల సంఘం.. ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధం విధించింది.. వెయ్యి మందితోనే సభలకు అనుమతి ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement