ఈశాన్య రాష్ట్రాల్లో అసెంబ్లి ఎన్నికలకు నాగారా మోగింది. నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. త్రిపురలో ఫిబ్రవరి 16న ఎన్నికలు జరుగుతాయని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలలో ఫిబ్రవరి 27న పోలింగ్ జరుగుతాయని చెప్పారు. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 2న వెలువడనున్నాయి. నాగాలాండ్ శాసన సభ పదవీ కాలం మార్చి 12తోనూ, మేఘాలయ అసెంబ్లి టెర్మ్ మార్చి 15తోనూ, త్రిపుర శాసన సభ పదవీ కాలం మార్చి 22తోనూ ముగియనుంది. ఒకొక్క రాష్ట్రంలో 60 నియోజకవర్గాల చొప్పున మొత్తంగా 180 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో 62.8 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 1.76 లక్షల మంది ఓటర్లు తొలిసారి ఓటు వేయనున్నారు.
9125 పోలింగ్ కేంద్రాలు..
మూడు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 9125 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని, 376 పోలింగ్ బూత్‌లు మ#హళా సిబ్బంది ఆధీనంలో ఉంటాయని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 80శాతానికి పైగా పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయని, 70శాతం పోలింగ్ స్టేషన్లలో వెబ్‌క్యాస్టింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు. కొద్దిరోజుల కిందట ఈసీ బృందం ఈ మూడు రాష్ట్రాల్లో పర్యటించిందని, ఎన్నికలపై రాజకీయ పార్టీలు, స్థానిక యంత్రాంగం, పోలీసు సిబ్బంది అభిప్రాయాలు తీసుకుందని వెల్లడించారు. ఎన్నికల్లో జరిగే అక్రమాలపై సీవిజిల్ యాప్ ద్వారా ఎన్నికల కమిషన్‌కి తెలియజేయవచ్చునని అన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లోగా స్పందిస్తామని చెప్పారు. ప్రలోభాలు లేకుండా ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.
బీజేపీకి ప్రతిష్టాత్మకం..
ప్రస్తుతం ఈ మూడు రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బీజేపీ అధికారంలో ఉంది. త్రిపురలో మాణిక్ సాహా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మనుగడ సాగిస్తుండగా, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలలో సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. నాగాలాండ్‌లో నేషనలిస్ట్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ కూటముల ప్రభుత్వాలు ఉన్నాయి. జాతీయ గుర్తింపు పొందిన ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఏకైక పార్టీ నేషనల్ పీపుల్స్ పార్టీ కావడం గమనార్హం.