Sunday, November 17, 2024

ఫార్ములా-ఇ రేసులకు చకచకా ఏర్పాట్లు.. హైదరాబాద్‌లో ట్రాకు నిర్మిస్తున్న హెచ్‌ఎండీఏ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో వచ్చే ఏడాది నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఫార్ములా-ఇ రేసుల పోటీల ట్రాక్‌(సర్క్యూట్‌) నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ పోటీల కోసం సుమారు 2.8 కి.మీ మేర ట్రాక్‌ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ట్రాక్‌తో పాటు రేసులో పాల్గొనే డ్రైవర్ల విశ్రాంతి గదులు, ప్రేక్షకుల గ్యాలరీలను తీర్చిదిద్దనున్నారు. 2023 ఫిబ్రవరి 11వ తేదీన ఈ పోటీలు జరగనున్నాయి. ఫిబ్రవరి 6వ తేదీ నుంచే వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారను. ఫార్ములాఇ అనేది ప్రపంచంలో ఎలక్ట్రిక్‌ సింగిల్‌ సీటర్‌ రేసింగ్‌ సిరీస్‌. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 9 నగరాల్లో ఈ పోటీలను నిర్వహించారు. ప్రస్తుతం ఈ పోటీలకు హైదరాబాద్‌ వేదిక కానుంది.

ఎలక్ట్రిక్‌ వాహనాల పరిశ్రమలకు రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే ఉద్దేశంతో రేసు నిర్వహించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ రేసులకు కావాల్సిన మౌలిక వసతులను హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) కల్పిస్తోంది. ఒక్క ఎన్టీఆర్‌ పార్కులోనే ఆరేడు వందల మీటర్ల పొడవు నాలుగు లైన్లలో ట్రాక్‌ను తీర్చిదిద్దారు. మింట్‌ కాంపౌండ్‌, ఐమాక్స్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌లో ప్రస్తుతం ఉన్న రోడ్లపైనే బ్లాక్‌ టాపింగ్‌ పనులు కొనసాగుతున్నాయి.

సుమారు 200 కి.మీ వేగంతో దూసుకువెళ్లే ఈ వాహనాలకు ఎక్కడా గోతులకు ఆస్కారం లేకుండా ట్రాకును నిర్మించాల్సి ఉంటుంది. మొత్తం 11 ప్రాంతాల్లో మలుపులు ఉంటాయి. ట్రాక్‌ పనులు పూర్తయిన తర్వాత అంతర్జాతీయ నిపుణులు భద్రతా పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని ప్రమాణాలు పాటించినట్లు సంతృప్తి చెందితేనే పోటీలకు అనుమతిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement