తిరుపతి : కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 11 నుండి 19వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని జెఈవో వీరబ్రహ్మం అన్నారు. కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాల తర్వాత స్వామివారి వాహన సేవలు బయట జరుగుతున్నాయన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టామన్నారు. శ్రీనివాసమంగాపురంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 15న గరుడసేవ, ఫిబ్రవరి 16న స్వర్ణరథోత్సవం, ఫిబ్రవరి 18న రథోత్సవం, ఫిబ్రవరి 19న చక్రస్నానం జరుగనున్నట్టు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు వైభవంగా నిర్వహించనున్నట్లు వివరించారు.
ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం..
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం ఉదయం 8.40 నుండి 9 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. అంతకుముందు ఉదయం 6.30 నుండి 8.15 గంటల వరకు స్వామివారి తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం ద్వారా తన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారు. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మీన లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఇందులో వైఖానస శాస్త్రోక్తంగా గరుత్మంతుణ్ణి కొత్త వస్త్రంపై లిఖించి, పూజలు చేసి, ధ్వజస్తంభంపై ప్రతిష్టించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. ఆలయ ప్రధాన కంకణబట్టార్ శ్రీ బాలాజీ రంగాచార్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
కాగా , శనివారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు స్వామివారు పెద్ద శేష వాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, ఏఈఓ శ్రీ గురుమూర్తి, సూపరింటెండెంట్ శ్రీ చెంగల్రాయులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.