Monday, November 18, 2024

వేగంగా రేషన్‌కార్డుల ఈకేవైసీ ప్రక్రియ.. అనర్హులను ఏరివేసేలా ప్రభుత్వం పకడ్బంధీ ఏర్పాట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. తెల్ల రేషన్‌ కార్డులో పేర్లు ఉన్న లబ్ధిదారులకే బియ్యం అందేలా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా రేషన్‌ కార్డుల వెరిఫికేషన్‌కు శ్రీకారం చుట్టింది. కుటుంబ యజమానితోపాటు కార్డులో పేర్లు ఉన్న ప్రతి లబ్ధిదారు తమ పరిధిలోని ప్రభుత్వ రేషన్‌ దుకాణానికి వెళ్లి ఈకేవైసీ ప్రక్రియలో వేలిముద్రలను అందించాలని ఆదేశించింది.

ఈ నేపథ్యంలో ఆహార భద్రత కార్డుల్లోని కుటుంబ సభ్యుల వివరాలను రేషన్‌కార్డులకు అనుసంధానం చేసేందుకు చేపట్టిన ఈకేవైసీ ప్రక్రియ రాష్ట్రంలో వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే రేషన్‌ కార్డుల్లో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులకు రేషన్‌షాపుల్లో బయోమెట్రిక్‌ ద్వారా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. దీంతో విదేశాల్లో ఉన్నవారితోపాటు అనర్హుల వివరాలు తేలనున్నాయి. రేషన్‌ డీలర్ల ద్వారానే ఈ-పాస్‌ ద్వారా వేలిముద్రల సేకరణ జరుగుతుండడంతో లబ్ధిదారులు వేలిముద్ర వేయడం సులువుగా మారింది.

రేషన్‌ దుకాణాల్లో బియ్యం కోసం వెళ్లే లబ్ధిదారులు కేవైసీ ప్రక్రియను చేయించుకొని బియ్యాన్ని పొందుతున్నారు. లబ్ధిదారులు కేవైసీ పునరుద్ధరణ చేయించుకోవడానికి ఈ పాస్‌ యంత్రం ద్వారానే చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఈ-పాస్‌ యంత్రాల్లో కొత్త అప్లికేషన్‌ను అందుబాటులో ఉంచారు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో పలు జిల్లాల్లో వేగంగా కొనసాగుతోంది.

రాష్ట్రంలో దాదాపు 90లక్షల తెల్లరేషన్‌కార్డులు ఉన్నాయి. రేషన్‌కార్డులు కలిగిన వినియోగదారుల్లో కుటుంబ యజమానులు మరణించడం, కుటుంబంలో ఆడబిడ్డలకు పెళ్లిళ్లు జరిగి వెళ్లిపోవడం, మగపిల్లలుంటే పెళ్లయ్యాక వారు కుటుంబం నుంచి విడిపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్న తరుణంలో కుటుంబ సభ్యుల్లో కొందరు లేకున్నా బియ్యం మాత్రం యూనిట్‌ ఒక్కింటికి ఆరు కిలోల చొప్పున యథాతథంగా పంపిణీ అవుతున్నాయి.

- Advertisement -

దీంతో బియ్యం పంపిణీలో వృథాను అరికట్టేందుకు రేషన్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఈకేవైసీ అప్డేట్‌ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తమ కుటుంబ రేషన్‌కార్డులో పేరు ఉన్న ప్రతీ ఒక్కరూ సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని, లేనిపక్షంలో రేషన్‌ సరుకుల పంపిణీ నిలిచిపోతుందని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేస్తోంది. ఈకేవైసీ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల జారీ, కార్డుల్లో కొత్త పేర్ల చేర్పులు, మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి.

ఇలా ఈ-కేవైసీ నమోదు

జిల్లాలో రేషన్‌ కార్డు కలిగిన కుటు-ంబ యజమానితోపాటు కార్డులో ఉన్న సభ్యులందరూ తమకు సమీపంలో ఉన్న రేషన్‌ డీలర్‌ వద్దకు వెళ్లి ఈ-పాస్‌ యంత్రం ద్వారా వేలిముద్రలు వేయాలి. వేలిముద్ర వేయడంతోనే రేషన్‌ కార్డు నంబరుతోపాటు సభ్యుల ఆధార్‌ నంబరు చూపిస్తుంది. వీరిని సరిచూసిన తరువాత ఆకుపచ్చ రంగు వెలిగి సభ్యుల కేవైసీ పునరుద్ధరణ అవుతుంది. ఈ పాస్‌ యంత్రంలో ఎరుపు రంగు వెలిగితే రేషన్‌ కార్డు, ఆధార్‌, సరిగా పోల్చుకోలేక పోవడంతో రిజెక్ట్‌ చూపిస్తుంది. దీంతో ఒక యూనిట్‌ రేషన్‌ కార్డు నుంచి తొలగింపు జరుగుతుంది. అందుబాటులో ఉన్న వ్యక్తులు వేలిముద్రలు వేయడం ద్వారా వేలిముద్రలు వేయని వారి యూనిట్లు- తొలగిపోతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement