Monday, November 25, 2024

‘ఏక్ మినీ కథ’ మూవీ రివ్యూ

రేటింగ్: 2.5/5

లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతపడటంతో చిన్న సినిమాలు ఓటీటీలలో విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంతోష్ శోభన్ నటించిన ‘ఏక్ మినీ కథ’ చిత్రం ఈరోజు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో నేరుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ కథ అందించిన ఈ చిత్రానికి కార్తీక్ రాపోలు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

సంతోష్ (సంతోష్ శోభన్) చిన్నప్పటి నుంచి తన పురుషాంగం చిన్నగా ఉంటుందనే భావనతో ఉంటాడు. సైజ్ చిన్నదిగా ఉండడం వల్ల వివాహ జీవితంలో సమస్యలు వస్తాయని భావించి పరిష్కారం కోసం పలు రకాలుగా ప్రయత్నిస్తాడు. చివరకు ప్రాణాలు పణంగా పెట్టి ఆపరేషన్‌కి కూడా సిద్దమౌతాడు. కానీ అతడి సమస్యకు పరిష్కారం లభించదు. ఈ క్రమంలోనే అతడికి అమృత(కావ్య థాపర్)తో పెళ్లి అవుతుంది. కానీ సైజ్ కారణంగా శోభనాన్ని మాత్రం వాయిదా వేస్తుంటాడు. ఇంతకీ సంతోష్ సమస్యకు పరిష్కారం దొరికిందా, అతడి సమస్య కాపురంలో ఎలాంటి సమస్యలు తెచ్చిందన్నదే మిగతా కథ.

‘పేపర్ బాయ్’తో ఆకట్టుకున్న హీరో సంతోష్ శోభన్ ఈ సినిమాలో తన పురుషాంగం చిన్నదనే భావన ఉన్న యువకుడి పాత్రలో చక్కగా నటించాడు. తన అమాయకత్వపు పనులతో నవ్వించాడు. సినిమా భారం మొత్తాన్ని తన మీద వేసుకుని కథని నడిపించాడు. హీరోయిన్‌ కావ్య థాపర్‌ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో బాగా చేసింది. కుమారుడిని అపార్థం చేసుకునే తండ్రిగా బ్రహ్మాజీ మెప్పించాడు. హాస్యనటులు సుదర్శన్‌, సప్తగిరి ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశారు.

కథ బోల్డ్‌గా ఉన్నా సెన్సిబుల్ పాయింట్‌కు కామెడీ పూత పూసి ఆకట్టుకునేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. కానీ కుటుంబ సమేతంగా ఈ సినిమా చూసేందుకు ఇబ్బందిగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే నెమ్మదిగా సాగడం ఈ సినిమాకు మైనస్. పస్టాఫ్‌లో కామెడీ బాగున్నా.. కొన్ని సీన్లు కావాలని ఇరికించారనే ఫీలింగ్‌ కలుగుతోంది. ఇక సెకండాఫ్ మొత్తం శోభనాన్ని వాయిదా వేయడంపైనే తిరుగుతుంది. హీరోయిన్ శ్రద్ధాదాస్ తర్వాత కథ ఊపందుకుంటుందని భావించినా నిరాశే కలుగుతుంది. యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement