లక్షల ఏండ్ల క్రితం భూమిపై సంచరించి, ప్రతికూల వాతావరణం కారణంగా అంతరించిన జీవజాతి డైనోసార్లు.. ప్రపంచవ్యాప్తంగా వీటి అవశేషాలు ఇప్పటికీ శిలాజ రూపంలో బయటపడుతున్నాయి. లేటెస్టుగా మధ్యప్రదేశ్ లోనూ ఈ రాక్షస బల్లుల గుడ్లను గుర్తించారు. అయితే, ఇప్పటివరకు లభ్యమైన గుడ్లతో కంపేర్ చేస్తే ఇవి ఎంతో డిఫరెంట్‌గా ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో డైనోసార్ ఫోసిల్ నేషనల్ పార్క్ లో తవ్వకాలు చేపట్టారు. ఈ సందర్భంగా 10 డైనోసార్ గుడ్లను వెలికితీశారు. అవన్నీ అసాధారణరీతిలో ఉన్నట్టు గమనించారు.
ఇవన్నీ సారోపోడ్ వర్గానికి చెందిన టిటానోసారస్ అనే డైనోసార్ జాతికి చెందినవిగా ఢిల్లీ యూనివరసిటీ పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా ఒక గుడ్డులోనే మరొక గుడ్డు ఏర్పడి ఉండడం వారిని విస్మయానికి గురిచేసింది. దీన్ని శాస్త్రీయ పరిభాషలో ‘ఓవమ్ ఇన్ ఓవో’ అంటారు. అంటే ‘బహుళ కర్పరాలు కలిగిన గుడ్లు’ అని అర్థం. గుడ్డులోనే గుడ్డు ఉండడం అనేది పక్షుల్లో అధికంగా కనిపిస్తుందని, దాని ప్రకారం టిటానోసారస్ డైనోసార్లకు పక్షులకు మధ్య దగ్గరి సంబంధం ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
పక్షుల మాదిరిగానే ఇవి కూడా వరుసగా గుడ్లు పెట్టే లక్షణాన్నికలిగి ఉండేవేమో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లో ఈ తరహా డైనోసార్ గుడ్లు లభ్యం కావడం సైంటిఫిక్ రిపోర్ట్స్ అనే జర్నల్ లో ప్రచురితమైంది. కాగా, ధార్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో 52 టిటానోసారస్ సారోపోడ్స్ డైనోసార్ గూళ్లను కూడా కనుగొన్నారు. ఈ జాతికి చెందిన డైనోసార్లు పక్షుల మాదిరే గూళ్లు కట్టుకునేవని, గుడ్లు పెట్టి, పిల్లలను పొదిగి పెద్దవి చేసేదాకా ఎంతో శ్రద్ధ తీసుకునేవని పరిశోధకులు చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.