Tuesday, November 26, 2024

సంక్రాంతి ప్ర‌యాణాల‌పై ఒమిక్రాన్ ప్ర‌భావం.. సంధిగ్ధంలో ఆర్‌టీసీ..

ఒమిక్రాన్‌ కేసులు రాష్ట్రంలో శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో సంక్రాంతి ప్రయాణాలపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. సంక్రాంతికి ఊరెళ్ళేందుకు కొంత మంది టికెట్లను రిజర్వ్‌ చేసుకున్నారు. ఊరుకిపోదాం అని అనుకుంటున్న‌ స‌మ‌యంలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటం, రోజుకో కొత్త రకమైన ఆంక్షలను ప్రభుత్వాలు అమలు చేస్తుండటంతో.. ప్రయాణాలు చేయోచ్చా? వద్దా? అన్న సందిగ్ధం ఏర్పడింది. రద్దీకి అనుగుణంగా రైళ్ళను పెంచేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తుండగానే కొన్ని రైళ్ళ రిజర్వేషన్లు రద్దు అవుతుండటంతో ఆచితూచీ అదనపు రైళ్ళను ప్రకటించాలని అధికారులు నిర్ణయించారు.
ఇప్పటికే ఏపీఎస్‌ఆర్‌టీసీ దాదాపు 1800 ప్రత్యేక బస్సులు నడపుతున్నట్లు ప్రకటించి ప్రత్యేక బస్సులలో ప్రత్యేక చార్జీలని వెల్లడించింది. టీఎస్‌ఆర్‌ టీసీ మాత్రం ఇప్పటి వరకు ఎన్ని బస్సులు నడపాలన్న అంశంపై స్పష్టతకు రాలేకపోతోంది.

గతంలో మాదిరిగా బస్‌ టికెట్లకు ప్రయాణికుల నుంచి డిమాండ్‌ రావడం లేదని అంటున్నారు టీఎస్‌ఆర్‌టీసీ అధికారులు. గడచిన సంవత్సరాలలో సంక్రాంతి పండగ రద్దీని తట్టుకునేందుకు దాదాపు నాలుగు వేల బస్సులను నడపేవారు. అయినప్పటికీ చివరి క్షణంలో రద్దీ పెరిగి ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సారి పండుగ స్పెషల్స్‌కు టీఎస్‌ఆర్‌టీసీ ప్రత్యేక చార్జీని ఎత్తి వేయడంతో ఏపీఎస్‌ఆర్‌టీసీ కంటే ఎక్కువ డిమాండ్‌ ఉండనుంది. అయినప్పటికీ ఒమిక్రాన్‌ నేపథ్యంలో ప్రయాణాలపై ప్రజల్లో నిర్లిప్తత నెలకొనడంతో ఎంత వరకు సక్సెస్ అవుతామన్న తర్జన భర్జనలో అధికారులున్నారు. ఏ మార్గంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉందన్న అంచనా కూడా సరిగ్గా తెలియకపోవడంతో ఎన్ని బస్సులను పండుగ స్పెషల్స్‌గా నడపాలన్న విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొంది. అనూహ్యంగా ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటం, రోజుకో ఆంక్షలను ప్రభుత్వాలు విధిస్తుండటంతో రద్దీ ఉంటుందా? ఉండదా, ఉంటే ఎంత మేర కలిసి వస్తుందన్న చర్చలో అధికారులున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement