Tuesday, November 26, 2024

Big story | డీజిల్‌ ధరల ఎఫెక్ట్‌ … పెరుగుతున్న సాగు కష్టాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వరి సాగు కష్టాలు ఏటేటా పెరుగుతున్నాయి. ఏటికేడు సాగు భారంగా మారుతోంది. ప్రస్తుతం వానాకాలం వరి సాగు కోసం రైతులు సిద్ధమయ్యారు. వర్షాలు పడగానే బురద పొలాన్ని సిద్ధం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఏటేటా దున్నకం ఖర్చులు పెరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గకపోవడంతో వరి పొలం దున్నేందుకు ట్రాక్టర్‌ యజమానులు ధరలను పెంచారు.

కిందటేడాది ఖరీఫ్‌లో ఎకరా బురద పొలం దున్నేందుకు రూ.5500 తీసుకున్న ట్రాక్టర్‌ యజమానులు…ఈ సారి ఆ వ్యయాన్ని రూ.6500 నుంచి రూ.7500 మధ్యన వసూలు చేస్తుండడంతో రైతులకు పెట్టుబడి ఖర్చు తడిసిమోపెడవుతోంది. ప్రస్తుతం డీజిల్‌ ధర రూ.97.82గా ఉంది. వాస్తవానికి ఈ ఏడు డీజిల్‌ ధర పెరగకున్నా ట్రాక్టర్‌ యజమానులు రైతుల నుంచి ఏటేటా దున్నకం ఖర్చును పెంచి తీసుకుంటున్నారు. ఇతర వ్యవసాయ యంత్రాల కిరాయిలు కూడా డీజిల్‌ ధరలకు అనుగుణంగా పెరుగుతూ పోతున్నాయి.

- Advertisement -

రెండేళ్ల క్రితం 2021లో లీటర్‌ డీజిల్‌ ధర రూ.67.88 ఉండగా ఇప్పుడు అది రూ. 97.82 పైసలకు చేరింది. రాష్ట్రంలో ఏటేటా వరిసాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. దీంతో ట్రాక్టర్లకు, కూలీలకు డిమాండ్‌ పెరుగుతోంది. అదే సమయంలో పెట్రోల్‌, డీజిల్‌, విత్తనాల ధరలు కూడా పెరుగుతుండడంతో వరి సాగుకు పెట్టుబడి ఊహించనిరీతిలో పెరుగుతోంది. మార్కెట్‌లో డీజిల్‌, పెట్రో ధరలతోపాటు ఎరువులు, విత్తన ధరలు ఏటికేడు పెరుగుతూపోతుండడంతో పెట్టుబడులు కూడా భారీగా పెరుగుతున్నాయి.

ట్రాక్టర్‌ యజమానులు బురద పొలం దున్నేందుకు కిరాయిని పెంచడంతో అందుకు అనుగుణంగా కూలీలు కూడా నాటు రేట్లను పెంచుతున్నారు. గతంలో ఎకరా వరి పొలాన్ని రూ.3500 నుంచి రూ.4వేలకు నాటు వేసే కూలీలు ఇప్పుడు రూ.6వేల దాకా అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. బురదపొలం సిద్ధం చేసేందుకు అయ్యే వ్యయమే పెరిగితే ఇక నాటు సమయంలో, చివరకు పంట చేతికొచ్చే సమయానికి పెట్టుబడి వ్యయం ఇంకెంత పెరుగుతుందోనన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement