ప్రభ న్యూస్ ప్రతినిధి ములుగు : ములుగు గట్టమ్మ తల్లికి ఎదురుపిల్ల పండుగను ఆదివాసీ సాంప్రదాయ పద్ధతిలో ఇవ్వాల ఘనంగా నిర్వహించారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలో ఆదివాసీ నాయక్ పోడ్ కమిటీ హాల్ నుంచి ఆదివాసులు శివసత్తులు, బోనాలతో ములుగు గట్టమ్మ వరకు దాదాపు రెండు కిలో మీటర్ల వరకు నడుచుకుంటూ చేరుకున్నారు. ఆదివాసి నాయకపోడ్ ములుగు గట్టమ్మ ప్రధాన పూజారి కొత్త సదయ్య ,ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ ఆధ్వర్యంలో ఎదురు పిల్ల పండగ జరిగింది. వారి కుల దైవమైన లక్ష్మీదేవరులతో.. సన్నాయి మేళాలు, డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా ఈ పండుగను నిర్వహించారు.
అమ్మవారి సేవలో..
ఆదివాసీ నాయక్ పోడ్ లు పురాతనం కాలం నుంచే గట్టమ్మ అమ్మవారి సేవలో నిమగ్నం అయ్యారు. వారి తాతలు, ముత్తాతల తరం నుంచి ఈ పూజలు నిర్వహిస్తున్నారు. గట్టమ్మ తల్లిపై ఆధారపడి 100 కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. గట్టమ్మ గుడి వెనక భాగంలో ఉన్న అటవీ ప్రాంతంలో కనుక వజినక తీసుకవచ్చి గుడికి ఇరువైపులా ఉన్న సమ్మక్క, సారలమ్మ గద్దెలపై కంక వనాన్ని ప్రతిష్టాపించారు. అనంతరం గట్టమ్మ తల్లికి బోనాన్ని సమర్పించారు. ఆదివాసి, నాయక్ పోడ్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన గట్టమ్మ ఎదురు పిల్ల పండుగలో శివసత్తుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.