హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా గురుకులాల్లో విద్యను అందిస్తున్నామని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల భాగంగా గిరిజన ఉత్సవాల సందర్భంగా శనివారం నాడు హైదరాబాద్ రాజేంద్రనగర్ ట్రైబల్ వెల్ఫేర్ ఐఐటీ స్టడీస్ సెంటర్లో మంత్రి పర్యటించారు. ఇటీవల ఐఐటి, ఎన్ఐటి, నీట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను మంత్రి కలసి అభినందించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోనే ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో గిరిజన విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారన్నారు. అంతేకాకుండా త్వరలో డైట్ ఛార్జీలు కూడా పెంచబోతున్నట్లు తెలిపారు. అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మంత్రి సర్టిఫికెట్లతో పాటు ల్యాప్టాప్లను అందజేశారు. విద్యార్థులకు స్వయంగా ఆమె భోజనం వడ్డించి వారితో కలిసి మంత్రి కూడా భోజనం చేశారు.