Friday, November 22, 2024

పది పరీక్షలు, ఫలితాలపై విద్యాశాఖ స్పెషల్‌ ఫోకస్‌.. ఉత్తమ ఫలితాలు సాధించేలా సిలబస్‌ రివిజన్‌, క్లాసులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యాశాఖ ఫోకస్‌ పెట్టింది. అందుకనుగుణంగానే డీఈఓలను, ప్రధానోపాధ్యాయులను ఇప్పటికే సన్నద్ధం చేసింది. ప్రైవేట్‌కు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ బడుల్లో ఫలితాలు మెరుగ్గా ఉండేందుకు అటు అధికారులు ఇటు ఉపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే పదో తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో గంట పాటు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను కూడా అందిస్తున్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమం కింద సర్కారు బడుల్లో సకల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. సరిపడా తరగతి గదులు, ప్రహరీ, టాయిలెట్స్‌, నీటి సరఫరా, విద్యుత్‌, ఫర్నిచర్‌ తదితర 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. పైగా ఏప్రిల్‌ 3 నుంచి 11 వరకు వార్షిక పరీక్షలు జరగనున్న నేపథ్యంలో పదోతరగతి విద్యార్థులకు విద్యాశాఖ స్పెషల్‌ క్లాసులను కూడా ఇప్పటికే మొదలుపెట్టింది.

ఇందులో భాగంగానే ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులకు గంట పాటు రివిజన్‌, ప్రత్యేక క్లాసులు తీసుకుంటున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి మంచి ఫలితాలు రాబట్టేలా స్పెషల్‌ కేర్‌ తీసుకుంటున్నారు. ప్రత్యేక క్లాసులు హాజరయ్యే విద్యార్థులకు అల్పాహారాన్ని కూడా అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుండటంతో ఈసారి పది ఫలితాలు మెరుగ్గా రావాలని ఉన్నతాధికారుల నుంచి హెచ్‌ఎంలకు, ఉపాధ్యాయులకు ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. వంద శాతం ఉత్తీర్ణత రాబట్టేలా పరీక్షలకు విద్యార్థులను అన్ని రకాలుగా సన్నద్ధం చేయాలని సూచించనట్లు తెలుస్తోంది. కొంత మంది విద్యార్థులకు పరీక్షలంటే భయం, ఆందోళన ఉంటుంది. ఇలాంటి విద్యార్థులను సైతం గుర్తించి వారికున్న భయాలను పోగొట్టేలా సన్నద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -

మొత్తం రాష్ట్రంలో 4,785 ప్రభుత్వ, జెడ్పీ, మోడల్‌ పాఠశాల్లలో పదోతరగతి చుదువుతున్న విద్యార్థులు 1,89,791 మంది విద్యార్థులున్నారు. 2022లో పది పరీక్షలను ప్రభుత్వ, ప్రైవేట్‌ అన్ని రకాల మేనేజ్‌మెంట్లలో చదివే విద్యార్థులు మొత్తం 5,03,579 మంది పరీక్షలు రాయగా, వారిలో 4,53,201 (90 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో మొత్తం 11,402 హైస్కూళ్లలో 3,007 బడుల్లో 100 శాతం ఫలితాలు వచ్చాయి. వీటిలో అధికంగా ప్రైవేట్‌ స్కూళ్లు 1500 ఉండగా, జిల్లా పరిషత్‌ స్కూళ్లు 987, కేజీబీవీలు 136, సోషల్‌ వెల్ఫేరో స్కూళ్లు 104 ఉన్నాయి. 15 హైస్కూళ్లలో ఒక్కరూ కూడా పాస్‌ కాలేదు. ఇందులో ప్రైవేట్‌ బడులు 9 ఉంటే మిగిలినవి ప్రభుత్వ బడులే. గతేడాదిలో 10/10 జీపీఏను 11,343 మంది సాధించగా, అందులో 9,484 మంది ప్రైవేట్‌ స్కూల్‌ విద్యార్థులే ఉన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు తక్కువ మంది ఉన్నారు. గతేడాది టెన్త్‌ ఫలితాల్లో సిద్ధిపేట ఫస్ట్‌ రాగా, హైదరాబాద్‌ చివరి స్థానంలో నిలిచింది.

ఈ విద్యా సంవత్సరం 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లకు కుదించడం, వంద శాతం సిలబస్‌తో పరీక్షలను నిర్వహించనున్న విషయం తెలిసిందే. గతేడాది 70 శాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహిస్తే ఈ సారి వంద శాతం సిలబస్‌కు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈక్రమంలో ఈసారి ప్రభుత్వ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరగడంతో పాటు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా, ఎక్కువ మంది 10/10 సాధించడంపై అధికారులు దృష్టిసారించారు. అయితే ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియతో ఉపాధ్యాయులు ఆ పనుల్లో నిమగ్నమవడంతో ఆ ప్రభావం ఫలితాలపై పడే అవకాశం లేకపోలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement