Tuesday, November 26, 2024

Education – లా కోర్సులు చదవాలంటే క్రిమినల్‌ బ్యాగ్‌గ్రౌండ్‌ తనిఖీ తప్పనిసరి..

ఆదేశాలు జారీ చేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే అమ‌లు

న్యూ ఢిల్లీ – బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) తాజాగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. న్యాయవాద వృత్తిలో పారదర్శకత, నైతిక ప్రమాణాలను పెంపొందించాలనే లక్ష్యంతో అనేక కొత్త నియంత్రణ చర్యలను తీసుకొచ్చింది. న్యాయ కళాశాలలు, విశ్వవిద్యాలయాలతో సహా అన్ని లీగల్ ఎడ్యుకేషన్ కేంద్రాలకు వర్తిస్తాయని ప్రకటించింది. న్యాయ విద్య, ఉద్యోగాల్లో చేరే వారికి తప్పనిసరిగా క్రిమినల్ బ్యాగ్‌ గ్రౌండ్‌ చెక్‌ చేయాలని బీసీఐ స్పష్టం చేసింది. ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే ఈ విధానం అమ‌లు చేయాల‌ని కోరింది. న్యాయవిద్య కోర్సుల్లో అభ్యర్థులకు మార్కుల మెమో, పట్టా ఇచ్చేముందు వారి పూర్వాపరాలను పరిశీలించాలని, నేరచరిత్ర ఉంటే తమ అనుమతి పొందిన తర్వాతే పట్టా ఇవ్వాలనే కఠిన నిబంధన విధించింది. ఈ మేరకు దేశంలో న్యాయవిద్య అందించే విశ్వవిద్యాలయాలు, కళాశాలలకు ఆదేశాలు జారీచేసింది.

లా కోర్సులు అభ్యసించే విద్యార్థులకు నేరచరిత్ర ఉండరాదని, అందుకే క్రిమినల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ చెక్‌సిస్టమ్‌ (సీబీసీఎస్‌)ను అమలు చేస్తున్నట్లు పేర్కొంది. మార్కుల ధ్రువపత్రాలు, డిగ్రీ పట్టాలు జారీచేసే ముందు విద్యార్థుల నేరచరిత్రను తప్పని సరిగా పరిగణనలోకి తీసుకోవాలని, ప్రస్తుత ఎఫ్‌ఐఆర్, నేరంపై కేసు, శిక్ష తదితర వివరాలను వెల్లడించాలని స్పష్టం చేసింది. ఒకవేళ నేరచరిత్ర ఉంటే వివరాలను బీసీఐకి పంపించి, వారి నుంచి అనుమతి వచ్చాకే విద్యార్థులకు పట్టాలు అందించాలని పేర్కొంది. ఆయా నిబంధనలపై విద్యార్థులంతా హామీపత్రం కూడా సమర్పించాలంది. న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించే వ్యక్తులు క్లీన్ క్రిమినల్ రికార్డును కలిగి ఉండేలనే లక్ష్యంతో ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement