హైదరాబాద్ ఆంధ్రప్రభ: తెలంగాణ ఎంసెట్-2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్ 14 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో జరగనున్న ఎంసెట్ పరీక్ష కోసం ఏప్రిల్ 6వ తేదీ నుంచి మే 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఎంసెట్ పరీక్ష తేదీలను ఇప్పటికే ప్రకటించిన ఉన్నత విద్యామండలి తాజాగా నోటిఫికేసన్‌ను విడుదల చేసింది. అయితే కోవిడ్ కారణంగా గత, ప్రస్తుత విద్యా సంవత్సరానికి 70 శాతం సిలబస్‌నే ప్రామాణికంగా తీసుకోవడంతో ఎంసెట్‌నూ 70 శాతం సిలబస్‌తోనే పరీక్ష నిర్వహించనున్నారు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొ.గోవర్ధన్ తెలిపారు. ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ విభాగాల కోసం ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.400, ఇతరులకు రూ.800 ఫీజు నిర్ణయించారు. రెండూ రాసే అభ్యర్థులకు రూ.1600 ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎంసెట్ నిర్వహణకు తెలంగాణలో 18 టెస్ట్ జోన్లు, ఏపీలో 5 జోన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎగ్జామ్ ప్యాటర్న్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించారు. 160 ప్రశ్నలను 180 నిమిషాల్లో పరీక్ష రాయవలసి ఉంటుంది. ఎంసెట్‌కు రెండు రాష్ట్రాల నుంచి సుమారు 2.40 లక్షల మంది దరఖాస్తు చేసుకోనున్నారు. అందులో 90 శాతం తెలంగాణ విద్యార్థులే ఉంటారు. గతేడాది ఎంసెట్ ఇంజనీరింగ్‌కు 1.64 లక్షలు, అగ్రికల్చర్, ఫార్మసీలకు 86వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ సారి కూడా ఇంటర్ మొదటి సంవత్సరంలో తప్పిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో ప్రభుత్వం పాస్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఎంసెట్‌కు పోటీ పడతారని అధికారులు భావిస్తున్నారు.
నో వెయిటేజీ… ఆ ర్యాంకుతోనే సీటు…
ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు ఈసారి వెయిటేజీ ఉండ దని అధికారులు చెప్తున్నారు. ఎంసెట్‌లో వచ్చే ర్యాంకు ఆధా రంగానే సీటు కేటాయిస్తారు. ఫస్ట్ ఇయర్‌లో 70 శాతం, సెకండ్ ఇయర్‌లో 70 శాతం సిలబస్‌నే ఈ సారి పెట్టారు. దీనికను గుణంగానే ఎంసెట్ ప్రశ్నపత్రం ఉంటుంది. గతంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఇంటర్‌లో 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కుల వస్తే ఎంసెట్‌కు అర్హత సాధించేవారు. కరోనా నేపథ్యంలో ఈ నిబంధనను ఎత్తివేస్తున్న ట్లు అధికారులు చెప్తున్నారు. ఈడబ్లూఎస్ కోటాను కూడా అమలు చేయనున్నారు. అయితే సోమవారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మాత్రం వెయిటేజీ, కనీస మార్కుల అర్హతపై స్పష్టత ఇవ్వలేదు.
పరీక్ష టైం టేబుల్..
14, 15న అగ్రికల్చర్, మెడికల్(ఏఎం) పరీక్ష. ఉదయం
9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు.
18, 19, 20 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్ష. మధ్యాహ్నం
3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.
జులైలో మిగతా సెట్స్…
ఇప్పటికే ఎంసెట్, ఈ-సెట్, పాలిసెట్ తేదీలు ఖరారైనాయి. మిగతా ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, సీపీగెట్, ఇతర సెట్స్ షెడ్యూల్ నేడు లేదా రేపు ఖరారు చేసే అవకాశం ఉంది. దాదాపు ఈ సెట్స్ పరీ క్షలు జులైలోనే జరగనున్నాయి. మంగ ళవారం తెలంగాణ ఉన్నత విద్యా మం డలిలో సెట్స్‌కు సంబంధించిన షెడ్యూ ల్‌ను ప్రకటించనున్నట్లు తెలిసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..