Tuesday, November 26, 2024

ఎడిటోరియ‌ల్ – బిజెపిని ఢీకొట్టి గెలిచిన కేజ్రీ….

మూడుసార్లు వాయిదా పడిన ఢిల్లి మేయర్‌ ఎన్నిక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎట్టకేలకు బుధవారం జరిగింది. ఢిల్లిలో అధికారంలోఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అభ్యర్ధిని షెల్లి ఒబెరాయ్‌ తన ప్రత్యర్ధిని, బీజేపీ అభ్యర్ధిని రేఖా గుప్తాపై 34 ఓట్ల ఆధిక్యంతో గెలుపొం దడం ఢిల్లి ముఖ్యమంత్రి, ఆప్‌ సారథి అరవింద్‌ కేజ్రీవాల్‌కి నైతిక విజయం. కేజ్రీవాల్‌ కేంద్రంలో అధికార పార్టీ బీజేపీతో దాదాపు యుద్ధమే చేస్తున్నారు. కేజ్రీవాల్‌ని అప్రదిష్టపాలు చేయడానికీ,గద్దె దింపడానికి కమల నాథులు అనుసరించని వ్యూహమంటూ లేదు. కేజ్రీవాల్‌ స్వతహాగా రాజకీయ వేత్త కాకపోయినా, మొదట్లో కాంగ్రెస్‌తోనూ, ఆ తర్వాత బీజేపీతోనూ అలుపెరగని రీతిలో రాజకీయ పోరాటాలు చేస్తూ రాటు తేలారు. ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షాలను కూడగట్టేందుకు తన వంతు సాయాన్ని అందిస్తున్నారు. ప్రాంతీయ పార్టీలకు ఆయన దన్నుగా నిలుస్తున్నారు. ఆయనపై కమలనా థులు కక్ష పెంచుకోవడానికి ఇదే కారణం. ఈ ఎన్నికకు కమలనాథులు సృష్టించిన అడ్డంకుల కారణంగానే ఇంత ప్రాధాన్యం వచ్చింది.

ఢిల్లి కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌కి 134 ఓట్లు, బీజేపీకి 104 ఓట్లు వచ్చాయి. కోఆప్టెడ్‌ సభ్యుల ఓటుతో ఢిల్లి పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ ఎన్నో కల లగన్నది. ఎన్నో అడ్డదారులు తొక్కింది. అయితే, సుప్రీంకోర్టు అండగా నిలవడం వల్ల కమలనాథుల ఆటలు సాగలేదు. నగరపాలక, పురపాలక సంస్థల చైర్‌ పర్సన్‌, మేయర్‌ పదవులను చేజిక్కించుకునేందుకు కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారంలో పార్టీలు ప్రయ త్నాలు సాగించడం సహజమే కానీ, కేజ్రీవాల్‌ని గద్దె దించాలనే లక్ష్యంతో కేంద్రం పన్నిన ఎత్తులు, కుయుక్తులు రాజకీయ వాదులకు రోత పుట్టించాయి. కేజ్రీవాల్‌కీ, లెప్టినెంట్‌ గవర్నర్‌కీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో విభేదాలు సృష్టించాయి. కేంద్ర హోం శాఖ పరిధిలో ఉన్న ఢిల్లిd మునిసిపల్‌ చట్టాన్ని ఆసరగా తీసుకుని ఆనాటి కాంగ్రెస్‌ పాలకులు కేజ్రీవాల్‌ని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించగా, అప్పట్లో కాంగ్రెస్‌ వైఖరిని దుయ్యబట్టిన బీజేపీ అంతకన్నా ఎక్కువగా ఇబ్బందులు పెడు తోంది. అయితే, కేంద్రం ఎన్ని ఒత్తిడులు తెచ్చినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, కేజ్రీవాల్‌ ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. కేజ్రీ వాల్‌ కుడి భుజం వంటి ఉప ముఖ్య మంత్రి మనీష్‌ సిసోడియాను అక్రమ కేసుల్లో ఇరికించి జైలుకి పంపేందుకు రంగాన్ని సిద్ధం చేశారు. అయితే, కేజ్రీవాల్‌, ఆయన డిప్యూటీ న్యాయపోరాటం ద్వారానే మేయర్‌ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగెలుపొందేట్టు కృషి చేసి విజయం సాధించారు.

గత డిసెంబర్‌లో జరిగిన ఢిల్లి మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ మొత్తం 250 వార్డుల్లో 134వార్డుల లో విజయం సాధించింది. ఈ ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని వనరులనూ కేంద్రీకరించినప్పటికీ 104 సీట్లను మాత్రమే గెల్చు కుంది. ఢిల్లి మునిసిపల్‌ మేయర్‌ పీఠాన్ని గెల్చుకోవడం ద్వారా అధికారాన్ని సుస్థిరం చేసుకోవా లని కమల నాథులు కలలుగన్నారు. పటిష్టమైన వ్యూహా లను రూపొందించి పూర్వాశ్రమంలో తమ పార్టీ నాయకుడైన వీకేసక్సేనాను లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమించి ఆయన ద్వారా ఆ వ్యూహాలను అమలు జేయించారు. ఢిల్లిdలో శాంతి భద్రతల పరిరక్షణ అంశం కేంద్ర హోం శాఖ పరిధిలో ఉండటం వల్ల ఢిల్లి ముఖ్యమంత్రి చేష్టలుడిగిన వ్యక్తిగా ఉండిపోవాల్సి వచ్చింది. కఠిన చర్యలు తీసుకోవడానికి వీలు లేకుండా కేంద్రం చేసింది. ఢిల్లిలో కొత్త సంవత్సరం ఆరంభం రోజున రాత్రి ఒక మహిళను కారు ఈడ్చుకుని పోయిన సంఘటనలో పారదర్శకంగా దర్యాప్తు జరగనీయకుండా అడ్డుపడింది. అలాగే, ఢిల్లిలో ముస్లింలు నివసించే ప్రాంతాల్లో అక్రమ ఆక్రమణల పేరిట బుల్‌డోజర్లను ప్రయోగించి భవనాలను నేల కూల్చింది. ఢిల్లి లిక్కర్‌ కుంభకోణం పేరిట భారీ స్థాయిలో పబ్లిసిటీ ఇచ్చి కేజ్రీవాల్‌ మంత్రివర్గంలో సభ్యులకూ, ఆయన మిత్రుల బంధుమిత్రులకూ ఈ కుంభ కోణంలో ప్రమేయం ఉందని లీకులు ఇచ్చి గడిచిన కొద్ది రోజులుగా విస్తృత ప్రచారం జరిపిస్తోంది. తనని అప్రదిష్టపాలు చేయడానికి కేంద్రం పన్నిన ప్రతి ఎత్తుగడనూ కేజ్రీవాల్‌ న్యాయపోరాటం ద్వారా ఎదుర్కొంటున్నారు. ఈసారి మేయర్‌ ఎన్నిక జరగడం అనుమానమేనన్న కథనాలు వెలువడ్డాయి. ఒకవేళ జరిగినా, ఆ పీఠాన్ని బీజేపీ ఎగరేసుకుని పోతుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లి మేయర్‌ పదవిని ఆప్‌ అభ్యర్ధిని కైవసం చేసుకోవడం చెప్పుకోదగిన విషయమే. షెల్లి ఒబెరాయ్‌ ఉన్నత విద్యావంతురాలు. ఢిల్లి యూనివర్శిటీలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. ఇది మాత్రం ముమ్మాటికీ కేజ్రీవాల్‌ విజయమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement