ఇదొక విచిత్ర పరిస్థితే. ఒక వికృత పరిణామమే. ఒక దుష్క్‌ృత క్రీడే. ఇవతల పార్లమెంటులో అవే మణిపూర్ ప్రకంపనలు. ఇప్పటికి ఆరు రోజులుగా ఇదే తంతు. ప్రతిపక్ష కూటమి ఇండియా అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందిన దరిమిలా ఉభయ సభల్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని ఆశించిన వారికి ఆశాభంగమే ఎదురైంది. పైపెచ్చు గురువారం..అంటే అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందిన మరునాడు యావత్ ప్రతిపక్ష సభ్యులు నల్లదుస్తుల్లో పార్లమెంటుకి హాజరై, తమ ఉద్యమ తీవ్రతను సంకేతాత్మకంగా తెలియజేశారు. ఉభయ సభల్లో ఆ రణగొణ ధ్వనుల్లోనే సభాపతులు సభా కార్యక్రమాలను నిర్వహించేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. కాని ఆ ప్రక్రియలో ముఖ్యమైన బిల్లులు సరైన పరిశీలన, చర్చ లేకుండానే ఆమోదం పొందడం ఒక విషాదం. రాజ్యసభలో విదేశాంగ మంత్రి జైశంకర్ భారతదేశ విదేశాంగ విధానం ప్రపంచస్ధాయిలో ఎలా విజయవంతమవుతు న్నదో వివరించే ప్రయత్నం చేసిన సందర్భంలో రాజ్య సభ హాలంతా ఉభయపక్షాల నినాదాలతో హోరెత్తింది. ప్రతిపక్షం ఇండియా ఇండియా అంటూ హోరెత్తించగా, పాలక పక్షం మోడీ మోడీ అంటూ ప్రతిధ్వినింపచేసింది. ఈ రణగొణ ధ్వనుల్లో జైశంకర్ కీలకోపన్యాసం మరుగు న పడిపోయింది.
అందుకే అసదుద్దీన్ ఒవైసీ ఒక మంచి మాట చెప్పారు. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందిం ది కాబట్టి సభను సాగనివ్వడం మంచిదని..లేకుంటే ముఖ్యమైన బిల్లులు యావత్ సభ కళ్లుగప్పి గడప దాటి ఆమోదం పొందేస్తున్నాయని ఆయన చెప్పిన మాట ప్రతిపక్షాలు ఆలోచించాల్సిన తీవ్ర అంశమే. ఇన్ని రోజుల వృధా తర్వాత పాలకపక్షమైనా ఇలాగే వాయిదా లు వేస్తూ పోతే కీలక సభా కార్యక్రమాలు మరుగున పడతాయి. అప్పుడు సభల ప్రయోజనం ఏముంటుం ది? ఈ సాకుతో పాలకపక్షం భిన్నాభిప్రాయాలకు నెలవులుగా ఉండే వివాదాస్పద బిల్లుల్ని కూడా మమ అనిపించి ఆమోదం పొందినట్టుగా రాజముద్రేసుకుం టాయి. ఇది యావత్ దేశానికి మరింత ప్రమాదకరమ వుతుంది. అందువల్ల ప్రతిపక్ష పార్టీలు బాధ్యతాయుతం గా వివేచనపూరిత అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రతిపక్షాలకు పెద్దగా ప్రత్యామ్నాయాలు కూడా లేవు. ఏది తక్కువ ప్రమాదకారి అని నిర్ణయించు కోవడమే.
మణిపూర్‌పై అవిశ్వాసంతో సరిపెట్టుకోవ డమా.. లేక బిల్లుల ప్రమాదాన్ని తెలిసి తెలిసీ వదిలేయ డమా? ప్రతిపక్షాలకు అగ్నిపరీక్షే. ఇక్కడే వాటి వివేచన మీద వాటి కార్యాచరణ ఇమిడి ఉంది. ఇవతల పార్లమెం టులో పరిస్థితి ఇలా ఉంటే అవతల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజస్ధాన్‌లోని శికార్‌లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడం పుండు మీద కారం చల్లినట్టయింది. ఇక్కడ పాలకపక్షపు బాధ్యతారాహిత్యం..ముఖ్యంగా ప్రధాని మోడీ ఆదర్శ భాషణాలు పరీక్షకు నిలుస్తున్నా యి. రాజస్ధాన్ పర్యటన ముందుగా నిర్దేశించిన కార్యక్ర మంగా చెప్పుకోవచ్చు గాని..హస్తినలో రాజకీయ వాతావరణం వానలు, వరదల చల్లదనంలోనూ వేడి పొగలు చిమ్ముతుంటే.. ప్రధానమంత్రి తన ప్రాధాన్యత లను సవరించుకోవాల్సిన అవసరం లేదా అన్న ప్రశ్న మాత్రం గింగురుమంటుంది. అందుకే ప్రతిపక్షం మరింతగా భగ్గుమంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభలో ఆ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. ఇవతల మణిపూర్ మణిపూర్ అని మేమంతా గొంతు చిల్లులు పడేలా అరుస్తుంటే అవతల ఆయన వెళ్లి ఎన్నికల ప్రచారం చేసుకుంటారా? ఆయన కు పార్లమెంటు, ప్రజల ఇక్కట్లు పట్టవా? అంటూ గర్జించారు. నిజమే. ఆ గర్జనలో అర్ధం ఉంది. ప్రధాని మోడీ ఏమి చెప్పదలుచుకున్నా పార్లమెంటులో చెబితే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీని, ప్రతిపక్షాల ఐక్యతను దుయ్యబట్టాలనుకుంటే అదేదో సభలోనే చేస్తే సరిపో తుంది. కాని ఆయన మాత్రం ఉభయ సభల్లో ఏ ఒక్క దానిలోనూ కాలు పెట్టడం లేదు. రాజస్ధాన్‌లో మాత్రం బహిరంగ వేదిక మీద యుపిఎ నిర్వాకాలను ఏకరువు పెట్టారు. ఇండియా కూటమిలోని ప్రతిపక్ష పార్టీలను ఏకిపారేశారు. యుపిఎ పాత పాపాలను కప్పిపుచ్చుకు నేందుకు ఇండియా అంటూ కొత్త నామధేయంతో వస్తున్నారంటూ దుయ్యబట్టారు. అంతేకాదు. ఈసారి ఇంకాస్త ముందుకెళ్లి, కుటుంబ పార్టీలు క్విట్ ఇండియా.. బుజ్జగింపులు క్విట్ ఇండియా..అవినీతి పార్టీలు క్విట్ ఇండియా అని సరికొత్త స్లోగన్లు ఇచ్చారు.
అంటే దేశం లోని కుటుంబ పార్టీలను, అవినీతి పార్టీలను, ఓటర్లను మాయమాటలతో బుజ్జగించే పార్టీలను దేశం నుంచి తరిమేయాలన్నది ఆయన రాజస్ధాన్ ఓటర్లకు ఇచ్చిన పిలుపు. నిస్సందేహంగా రాబోయే ఎన్నికల్లో కమల నాథులు ఈ నినాదాన్ని ఎన్నికల ప్రాణవాయువుగా స్వీకరించాలని మోడీ పరోక్షంగా బీజేపీ కేడర్‌కి, నాయకు లకు ఇచ్చిన హితోపదేశంగా భావించాలి. అంతసేపు మాట్లాడినా ఆయన మణిపూర్ అంశాన్ని వీసమెత్త యినా ప్రస్తావించకపోవడం గమనించాల్సిన విషయం. ఇంకా ఆయన రాజస్ధాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్నీ వదల్లేదు. రెడ్ డైరీతో కాంగ్రెస్ మరింత భ్రష్టు పట్టిందని ఆరోపించారు. అందుకు రాజస్ధాన్ ముఖ్యమంత్రి గెహ్లాట్ వెంటనే స్పందించారు. రెడ్ డైరీలో మీరు ఊహిం చేవేవీ కనిపించవు గాని..రెడ్ టమోటాల సంగతేమిటి? రెడ్ సిలిండర్ల ధరల సంగతేమిటి? అంటూ ఆయన ఎదురు విమర్శలు చేశారు. విమర్శకు ప్రతివిమర్శ ఉంటూనే ఉంటుంది. ఎన్నికల షెడ్యూలే విడుదల కాని రాజస్ధాన్ ఎన్నికల ప్రచారం కన్నా ఈశాన్యాన మండి పోతూ కుమిలిపోతున్న మణిపూర్ అంశమే ప్రధానమని పాలక ప్రతిపక్షాలు గుర్తెరిగి ఒక నిర్మాణాత్మక ఏకీకృత భావనతో ముందడుగు వేయాలని యావత్ జాతి ఆకాంక్షిస్తున్నది