టీచర్ల కుంభకోణంతో సంబంధం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తృణమూల్ మంత్రి పార్థా ఛటర్జీ రాష్ట్ర ప్రభుత్వం పరిథిలోని ఆస్పత్రిలో చేరిన నేపథ్యంలో అతడిని సైన్యం నిర్వహణలోని ఆస్పత్రికి మార్చాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కోర్టును ఆశ్రయించింది. తమ పిటిషన్‌ను అత్యవసరంగా చేపట్టాలని కోరింది. రాష్ట్రమంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలు, బంధువుల ఇళ్లపై గత రెండురోజుల క్రితం దాడులు చేసి భారీమొత్తంలో నగదు, ఇతర డాక్యుమెంట్లు, కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు ఛటర్జీని శనివారం ఉదయం అరెస్టు చేశారు. అయితే, అనారోగ్య కారణాలతో ఆయన ప్రభుత్వ సారథ్యంలోని ఎస్‌ఎస్‌కేఎమ్ ఆస్పత్రిలో చేరారు. కాగా ఆర్మీ సారథ్యంలోని కమాండ్ ఆస్పత్రికి ఆయనను తరలించేందుకు, విచారించేందుకు అనుమతించాలని కలకత్తా హైకోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసరంగా తమ కేసును విచారించాలని కోరింది. మంత్రి ఛటర్జీకి సన్నిహితురాలైన పార్టీ నేత అర్పిత ముఖర్జీ ఇంటిపై దాడి చేసిన ఈడీ రూ.20 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
మమత మౌనమేల-బీజేపీ
ఇదే కుంభకోణంతో సంబంధం ఉందన్న అనుమానంతో ఛటర్జీ దగ్గరి బంధువు, కాజీ నజ్రుల్ వర్శిటీ ప్రొఫెసర్ మొనాలిసా దాస్‌పైనా ఈడీ దృష్టి సారించింది. ఆమె పేరుమీద పది ప్లాట్లున్నాయని, బంగ్లాదేశ్‌తో ఆమెకు సంబంధాలున్నాయని బీజేపీ నేత దిలీప్ ఘోష్ ఆరోపించడం గమనార్హం. కాగా తన మంత్రివర్గంలోని సభ్యుడు పార్థా ఛటర్జీ అవినీతి ఆరోపణలపై ఈడీ అరెస్టు చేస్తే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించకుండా మౌనవ్రతం ఎందుకు పాటిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఐటీవిభాగం ఇన్‌ఛార్జ్ అమిత్ మాళవీయ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
జోక్యం చేసుకోం టీఎంసీ
కాగా పార్థా ఛటర్జీ వ్యవహారంతో తృణమూల్ కాంగ్రెస్‌కు ఎటువంటి సంబంధం లేదని, ఈ ఉందంతం విషయంలో జోక్యం చేసుకోబోమని ఆ పార్టీ అధికార ప్రతినిధి కుమాల్ ఘోష్ ఆదివారం ప్రకటించారు. ఈ కేసు దర్యాప్తును నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేయాలని కోరారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ దాడి చేసిన మహిళ అర్పితతోకాని, అధికారులు స్వాధీనం చేసుకున్న నగదుతోకాని తృణమూల్‌కు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ నాయకుడైనా తప్పు చేసినట్టయితే, ఆ వ్యవహారంలో రాజకీయంగా తాము తలదూర్చబోమని స్పష్టం చేసింది. ఈ కేసులో చట్టం తన పని తాను చేస్తుందని, తృణమూల్ కాదని ప్రకటించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.