Sunday, November 24, 2024

‘ఈడీ’ సమన్లు కాదు ‘మోడీ’ సమన్లు.. ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) పంపిన నోటీసులు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం ఢిల్లీలో బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈడీ సమన్ల వ్యవహారంతో పాటు మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం తలపెట్టిన దీక్ష గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా గురువారమే విచారణకు హాజరుకావాల్సిందిగా ఈడీ సమన్లు పంపించిందని, అయితే జంతర్ మంతర్ దీక్ష సహా ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాల దృష్ట్యా తాను ఈనెల 16న విచారణకు హాజరవుతానని చెప్పినా ఈడీ అంగీకరించలేదని ఆమె వెల్లడించారు. అయితే ఈ నెల 11న (శనివారం) విచారణకు హాజరయ్యేందుకు అంగీకరించారని తెలిపారు.

నిజానికి ఏ కేసులోనైనా మహిళలను ప్రశ్నించే దర్యాప్తు సంస్థలు వారికి ఇబ్బందికల్గించని రీతిలో వెసులుబాటు కల్పించాలని కోర్టు తీర్పులు చెబుతున్నాయని, ఈ కేసులో తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేదంటే తన నివాసానికి వచ్చి ప్రశ్నించవచ్చని, కానీ వ్యక్తిగతంగా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి హాజరుకావాలంటూ సమన్లు పంపించారని ఆమె తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా మోడీ అడుగుపెట్టే ముందు ఈడీ అడుగుపెడుతోందని, ఈ ఏడాది చివర్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ముందు ‘ఈడీ’ని మోడీ రంగంలోకి దింపారని కవిత ఆరోపించారు. మోడీ అధికారంలో ఉన్న ఈ తొమ్మిదేళ్లలో దర్యాప్తు సంస్థలను ప్రయోగించి 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోశారని, తెలంగాణలోనూ ఆ ప్రయత్నం చేసినప్పటికీ బెడిసికొట్టిందని అన్నారు. అందుకే కక్షగట్టి ఈడీని తనపై ప్రయోగించారని అన్నారు. అలాగని కేవలం తనతోనే సరిపెట్టలేదని, తమ పార్టీకి చెందిన నేతలపై కూడా దర్యాప్తు సంస్థలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.

- Advertisement -

దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పడానికి కళ్ల ముందే అనేక కారణాలు కనిపిస్తున్నాయని, తాము చెప్పినట్టుగా నడచుకునే ఈడీ, సెబీ వంటి సంస్థల డైరక్టర్ల పదవీకాలం ముగిసినప్పటికీ మళ్లీ మళ్లీ పొడిగిస్తుండడమే ఇందుకు నిదర్శనమని కవిత అన్నారు. పదవీకాలాన్ని పొడిగించాలని అనుకుంటే దేశ సేవ కోసం సైన్యంలో చేరే ‘అగ్నివీర్‌’లకు పొడిగించాలని ఆమె సూచించారు. దేశంలో డబుల్ ఇంజిన్ సర్కారు అంటే ఒక ఇంజిన్ ప్రధాని, మరో ఇంజిన్ అదానీ అంటూ ఆమె ఎద్దేవా చేశారు. తాను ఈడీ విచారణ ఎదుర్కొంటానని, అన్నింటికీ సిద్ధంగా ఉన్నానని, కానీ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన బీఎల్ సంతోష్ ఎందుకు విచారణ ఎదుర్కోలేకపోతున్నారని ఆమె ప్రశ్నించారు.

ధర్మం ఎటుంటే విజయం అంటే ఉంటుందని, జైల్లో ఉన్నంత మాత్రాన శ్రీకృష్ణుడి పుట్టుకను ఆపలేకపోయారని, అజ్ఞాతవాసం చేసినంత మాత్రాన అర్జునుడి శూరత్వం తగ్గిపోలేదని, వనవాసం చేసిన తర్వాత శ్రీరాముడు మరింత బలవంతుడయ్యాడే తప్ప తగ్గిందేమీ లేదని కవిత వ్యాఖ్యానించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement