న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలకు కూడా ప్రమేయముందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) నిర్వహించిన తాజా దాడులు స్పష్టం చేస్తున్నాయి. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ సహా పంజాబ్, హర్యానా రాష్ట్రాలు, హైదరాబాద్, నెల్లూరు, చెన్నై, బెంగళూరు నగరాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసంలోనూ ఈడీ బృందాలు సోదాలు జరిపాయి. ఢిల్లీలోని లోధి ఎస్టేట్‌లో ఆయనకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన అధికారిక నివాసంలో ఈడీ బృందాలు సోదాలు జరిపాయి. ఉదయం సుమారు గం. 7.00 కే ఈడీ అధికారులు మాగుంట నివాసానికి చేరుకున్నారు. సెక్యూరిటీ సిబ్బంది సహా ఇంట్లో పనిచేసే సిబ్బంది ఎవరినీ బయటకు వెళ్లనీయకుండా కట్టడి చేశారు. సిబ్బంది మరెవరికీ ఫోన్ చేయడానికి వీల్లేకుండా ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో ఈడీ అధికారులు తమ వెంట కేంద్ర పారామిలటరీ బలగాలైన సీఆర్పీఎఫ్ వంటి బలగాలను భద్రత కోసం తీసుకెళ్లారు. అయితే మాగుంట నివాసం వద్ద సాయంత్రం వరకు సాయుధ బలగాల భద్రత కోరలేదు. కానీ మీడియా ప్రతినిధుల హడావుడి పెరిగే సరికి సాయంత్రం గం. 4.00 సమయంలో ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లను భద్రత కోసం పిలిపించుకున్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన కంపెనీల పాత్ర కూడా ఉందని ఆరోపణలున్నాయి. మాగుంట ఆగ్రో ఫార్మ్స్ సహా వేర్వేరు పేర్లతో ఉన్న సంస్థలు ఈ కుంభకోణంలో ఉన్నాయి. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కోసం ఎక్సైజ్ పాలసీ రూపొందించడం నుంచి మొదలుపెట్టి దాన్ని అమలుచేయడం వరకు ప్రతి స్థాయిలోనూ మద్యం వ్యాపారులకు లబ్దిచేకూరేలా నిర్ణయాలు తీసుకున్నట్టు తీవ్ర ఆరోపణలున్నాయి. లైసెన్స్ ఫీజులో రాయితీ, డీలర్ కమిషన్‌ను 2% నుంచి ఏకంగా 12% వరకు పెంచడం సహా అనేకరూపాల్లో ఎక్సైజ్ పాలసీ ద్వారా మద్యం వ్యాపారులు లబ్దిపొందారు. భారీగా లబ్దిపొందిన మద్యం వ్యాపారులు ఢిల్లీ రాష్ట్ర మంత్రులకు అడ్వాన్సు రూపంలో ముడుపులు చెల్లించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటిపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, ఈ మొత్తం వ్యవహారంలో చోటుచేసుకున్న మనీ లాండరింగ్ వ్యవహారంపై ఈడీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో గత నెలలో కేసు నమోదు చేసి దేశవ్యాప్తంగా సోదాలు జరపగా, తాజాగా శుక్రవారం మరోసారి సోదాలు జరిపింది. ఢిల్లీలోని మొత్తం 32 జోన్లలో 4 జోన్లు మాగుంట శ్రీనివాసులురెడ్డికి చెందిన సంస్థలు దక్కించుకుని నిర్వహించినట్టు దర్యాప్తు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇతర మద్యం వ్యాపారుల మాదిరిగానే మాగుంటకు చెందిన సంస్థలు సైతం అక్రమమార్గాల్లో లబ్దిపొందినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించే క్రమంలోనే ఢిల్లీ సహా నెల్లూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో మాగుంట నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిపినట్టు తెలిసింది. అయితే స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు లేదా నగదు, ఆస్తుల పత్రాలకు సంబంధించి ఈడీ అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన జారీ చేయలేదు.