హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: ఎన్నారై మెడికల్ కళాశాల యాజమాన్యం భారీ అక్రమాలకు పాల్పడిందని ఈడీ తేల్చింది. విజయవాడ కళాశాలతో పాటు కార్యాలయాలు, డైరెక్టర్ల ఇళ్ళల్లో ఈడీ అధికారులు రెండు రోజులు ఏకధాటిగా సోదాలు నిర్వహించింది. రెండు రోజుల సోదాలకు సంబంధించి బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సోదాల్లో మొత్తం 53 చోట్ల స్థిరాస్తులను గుర్తించామని ఈడీ వెల్లడించింది. విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్‌లలో విస్తృతంగా సోదాలను నిర్వహించామన్న అధికారులు భారీ అక్రమాలను గుర్తించినట్టు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన కేసులో భాగంగా పీఎమ్ఎల్ఏ కింద కూడా కేసు నమోదు చేశామని ఈడీ అధికారులు తెలిపారు. నగదుతో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నామని, పలు ఆస్తులు ఉన్నట్లు గుర్తించామని, వాటన్నింటినీ సీజ్ చేశామని తెలిపారు. ఎన్ఆర్ఐ సొసైటీకి చెందిన నిధులను భవన నిర్మాణాల పేరుతో యాజమాన్యం దుర్వినియోగం చేసిందని, కోవిడ్ సమయంలో రోగుల నుంచి భారీగా నగదు వసూలు చేశారని ఈడీ తెలిపింది. కొవిడ్ నుంచి వచ్చిన ఆదాయాన్ని ఎన్ఆర్ఐ సొసైటీ ఖాతాల్లో చూపించలేదని గుర్తించినట్లు పేర్కొంది. ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో అడ్మిషన్ల పేరుతో వసూళ్లు చేశారని, ఇలా వచ్చిన ఆదాయాన్ని దారి మళ్లించినట్లు ఈడీ వెల్లడించింది.
ఎన్ఆర్ఐ సొసైటీ ఖాతా నుంచి ఎన్‌ఆర్‌ఐఏఎస్ అనే మరో ఖాతాకు బదిలీ చేసినట్లు గుర్తించామని ఈడీ పేర్కొంది. బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసిన ఈడీ కొన్ని ఆస్తులను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంది. హార్డ్‌డిస్క్‌లు, డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నామని, త్వరలోనే యాజమాన్యం, డైరెక్టర్లను విచారణకు రావాలంటూ నోటీసులు పంపిస్తామని పేర్కొంది.