ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో ఆయనను అదుపులోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన నివాసం వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు.
ఈ కేసులో కేజ్రీవాల్ ఆరెస్ట్ పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఆయనకు ఈడీ అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పించలేమని స్పష్టం చేసింది. కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
దాదాపుగా 8 నుంచి 12 మంది అధికారులు కేజ్రీవాల్ నివాసంలో ఉన్నట్లు సమాచారం. కేజ్రీవాల్ ఇప్పటి వరకు 9 సార్లు ఈడీ సమన్లను దాటవేయగా..10వ సారి సమన్లు ఇచ్చేందుకు ఈడీ బృందం అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఆప్ నేతలు సత్యేందర్ జైన్, మనీస్ సిసోడియా, సంజయ్ సింగ్‌లను ఈడీ అరెస్ట్ చేసింది.