లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సాధిక్‌తో సంబంధమున్న అధికార డీఎంకే పార్టీ ముఖ్య నేతల ఇళ్లు, కార్యాలయాలు, సినీ ప్రముఖుల ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు.
మంగళవారం తెల్లవారుజూము నుండి చెన్నై సహా 35 చోట్ల ఏకకాలంలో ఈడీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. దర్శకుడు, నటుడు అమీర్ సుల్తాన్ ఇంట్లో అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, లోక్ సభ ఎన్నికల వేళ తమిళనాడులో అధికార డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం స్టాలిన్, మంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్ బీజేపీపై విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.
డీఎంకేకు ధీటుగా బీజేపీ సైతం కౌంటర్ ఇస్తుంది. ఏకంగా ప్రధాని మోడీ తమిళనాడులో వరుసగా పర్యటించి అధికార పార్టీపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలో డీఎంకే నేతల ఇళ్లలో సోదాలు జరగడం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది.